పుట:Kashi-Majili-Kathalu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100

కాదంబరి


పురకాంతలెల్ల నేమిజెప్పికొనిరి. సవిస్తరముగాఁ జెప్పుమని యడిగిన నతం డిట్లనియె.

దేవా! వినుండు. దేవర యరిగినవెనుకఁ బరిజనముతోఁ గూడఁ గాదంబరి సౌధమెక్కి తురగఖరధూళిరేఖా థూసరమగు మీమార్గమాలోకించుచు మీరు తిరోహితులైనంత మదలేఖయొక్క బుజంబున శిరంబిడి ప్రీతిచే నాదిగంతమునే చూచుచుఁ బెద్దతడవందే యున్నది. తరువాత నతికష్టమున నామేడ దిగి యాస్థానమంటపమున క్షణకాలము గూర్చుండి యంతలో లేచి మీరు నివసించిన క్రీడా పర్వతమున కరిగినది.

అందుఁ బరిజనులు రాజకుమారుఁ డీలతా మంటపమున నీచలవఱాతఁ గూర్చుండెను. నీమణిశిలయందున స్నానముగావించెను. నిందునిందుధరు నారాధించె, నిందు భుజించె. నిందుశయనించె నని యెఱింగింపుచుండ నాయాచిహ్నముల విలోకింపుచు నాపగలు గడపినది. సాయంకాలమున మహాశ్వేత బలవంతముసేయ నెట్టకే నాశైలశిలాపట్టమున భుజించినది అంతలోఁ జంద్రోదయ మగుటయు శశికరంబులకుఁ గపోలములపైఁ గరంబు లడ్డము పెట్టుకొని కన్నులు మూసి యేదియో థ్యానించుచు క్షణకాలమందుండి యంతలో లేచి శయ్యాగృహమున కేగి పండుకొనినది.

అది మొదలు ప్రబలమగు శిరోవేదనయు దాహరూపంబగు జ్వరంబును బాధింప నేదియో వ్యాథిచేఁ గొట్టికొనుచు నెట్టకే నా రాత్రి వేగించినది. నేఁటియుదయంబు నన్నుఁజేరి మీసేమము దెలిసికొనుటకై సోపాలంబముగా మీకడకనిపినది. ఇదియే యక్కడి వాత౯లని యెఱింగించిన నాలించి రాజనందనుఁడు తొందరగానందుఁ బోఁ దలంచి గుఱ్ఱము గుఱ్ఱమని కేకపెట్టెను. అప్పు డశ్వరక్షకుఁడు జీను గట్టి యింద్రాయుధము నెదురఁబెట్టుటయు పత్రలేఖను వెనుకఁ