పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనోరమ కథ

99

ఆహా ! ఆ మోహనాంగి సోయగం బెంత వింతగానున్నది. పుట్టంబు విడిచినను తదీయ దేహప్రభయే యంశుకావకుంఠనమువలె మెఱసినది. అధరకాంతియే కుంకుమావలేపనంబయ్యె నౌరా. లోచనంబులు కర్ణోత్పలంబులట్లు కనంబడినవి అంగుళిరాగంబు చరణాలిక్తంబుడంబు గైకొనినది వదనచంద్రికామరీచికలు కన్నులకు మిఱుమిట్లు గొల్పినవి. బాపురే! ఆలాపంబులు తంత్రీనాదంబులవలె వినఁబడినవి. తదీయాలంకారచిహ్నంబులంజూడ క్షత్రియకన్యకవలె నున్నది అన్నన్నా! పరమేష్టిసృష్టి చాలా చాతుర్యంబునకు మేరలేదుగదా? మదీయ దేశాటనంబునకు ఫలంబిదియే ఇక్కాంతం గౌగిట జేర్చువానికి ద్రిభువనాధిపత్యం బేమిటికి? ఒక్కసారి మాటాడినం జాలదే! వీక్షించిన బట్టభద్రునిం జేసినట్లుకాదే! అని అనేక ప్రకారంబులదలం కొనుచు వారిబండ్ల వెంబడి అనతిదూరముగా గగనంబున దన కురంగంబును నడిపించుచుండ ఆయ్యండజయాన లాశకటంబులతో గూడ నాచేరువనున్న పట్టణంబు కోటలోనికి బోయిరి.

అది అంతయుం గుఱుతుగా జూచుకొని కందర్పు డాపట్టణములో నొకచోట నాజింకందిగి దానినిమడిచి చంక నిడికొని యొక బ్రాహ్మణుని యింటికిం బోయి భోజనంబు యాచించెను.

ఆపాఱుండు పేదయైనను అతిథుల సత్కరించు స్వభావము కలవాడగుట అతని సత్కరించి రుచి సంపన్నంబైన అన్నంబు పెట్టెను. భుజించు సమయంబున బ్రస్తావముగా నిది యేదేశము! దీనింబాలించు రాజెవ్వడు? పరిపాలన మెట్టిది? విశేషము లేమని అడిగిన గందర్పున కాబ్రాహ్మణుడు అయ్యా! మీ మాటలు వింతలుగా నున్నవి. దేశము పేరును పట్టణము పేరును తెలియక యిక్కడికెట్లు వచ్చితిరి. ఆకాశము నుండివచ్చినట్లడుగు చుండిరేమి? ఇది మహారాష్ట్రదేశము. దీనింబాలించు రాజు పేరు వీరసేనుడు! ఇచ్చటి చట్టములు మన్వాదిముని కల్పితములు. మా రాజునకు బుత్రసంతతిలేదు. మనోరమ యను కూతురుగలదు. అమ్ముదిత బరమేష్టిసృష్టిచాతుర్యమునకు దుదియను చెప్పనోపు నీనడుమ దానికి స్వయంవరము చాటించిన బెక్కండ్రు రాజపుత్రులు వచ్చిరి. కాని యావిదుషి యెవ్వరిని వరించినదికాదు తన్మూలమున నాధాత్రీపతికి బుత్రికపై గోపముగా నున్నది. ఇవియ ఇచ్చటి విశేషములు. మీదే దేశము? మీరిచ్చటికేమిటికై వచ్చితిరని అడిగిన ఆతడాయనకు దత్సమయోచితముగా నుత్తర మిచ్చెను.

వెండియు నాపాఱునివలనం గోటలోని విశేషము లన్నియుం దెలిసికొని కందర్పుడు మిక్కిలి యౌత్సుక్యముతో నంగడికిం బోయి పుష్పమాలికాగంధాను లేపనాదులం గొని మేనం గైసేసి మనోహరవేషముతో నాటిరాత్రి నాజింకనెక్కి గగనమార్గంబున నమ్మనోరమ శుద్ధాంతమునకుం బోయెను.

అల నయ్యిందువదన సఖులతోడ గూడుకొని వేడుకగా వీణ పాడుచుండెను. తదీయగానము ఆలకించుటచే నతనికి మన్మథోద్రేకం బంతకంత కెక్కుడు కాజొచ్చి