పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చండిక కథ

95

తన్ను నిర్భంధించుటయు దా నొడంబడకపోవుటయు లోనగు వృత్తాంత మంతయుం జెప్పెను.

అప్పుడా రాజపుత్రిక అతని వకృత్వమునకు మిక్కిలి సంతసించుచు దమ దాపున నొకపీఠము వైపించి అందుగూర్చుండుమని సగౌరవముగా నియమించి తాను దెచ్చిన చిత్రపటము లతనికిం జూపి వానికారణములన్నియుం దెలిసికొని చివర సమ్మతించితివికావు గనుక నీశిరము ద్రుంపింతు చూడుమని యారీతి సంజ్ఞ వ్రాసి యున్న పటమెత్తి యాసంజ్ఞా ప్రకారమంతయు దండ్రి కెఱింగించి యీ హత్య యీ చిన్నదే చేసి యితనిమీద బెట్టినదని చెప్పినది.

ఈలోపల గూఢచారులలో నొకడువచ్చి యొక యుత్తరము దెచ్చి యారాజు పుత్రిక కిచ్చెను. దానిఁజదువ నిట్లున్నది. నాకిప్పుడొక శత్రువునిం బరిభవింవవలసి యున్నది. కావున నీచీటిందెచ్చిన చేటికకు విషరసంబిచ్చి వెంటనే పంపుము. నీ ప్రియురాలు చండిగ. ఆ చీటివ్రాసిన దివసము, ఆ యధికారి చచ్చిన దివసము నొక్కటియే ఆదినము సూర్యోదయకాలంబుస వ్రాసినట్లున్నది.

అట్టి చీటిని ముమ్మారు చదివి తండ్రికి బోధించుచు అప్పుడే యాచండికం బట్టితేర దూతలం బంచెను. ఆ చండిక వచ్చినతోడనే రాజపుత్రిక యాపత్రికం జూపుచు నిదియెవ్వరు వ్రాసిరి? చెప్పమన అత్తన్వి బెగడొందుచు నొకమాట జెప్ప దొడంగినది. ఆవ్యగ్రత గ్రహించి రాజపుత్రిక విషమప్రశ్నముల వైచి తుదకు యథార్థము దానిచేతనే చెప్పించెను ఆ రాజపుత్రికయొక్క. బుద్ధిసూక్ష్మతకు మిక్కిలి సంతసించుచు అప్పుడా చండికకు ద్వీపాంతరవాసశిక్షయు దానిపరిచారకులకు బంధనశిక్షయు విధించి కందర్పుని మిక్కిలి గౌరవించి అపచారము చెప్పుకొని తన అంతఃపురమునకు దీసికొనపోయి తగుసత్కారములు గావించెను.

అందు గందర్పుడు మద్యమంసాదుల ముట్టక స్వోచితంబైన భోజనమే కావించెను. రాజపుత్రికయు ఆతని బెండ్లి యాడవలయునని యిష్టమున్నను జండికను వలె దన్ను గూడ సమ్మతింపజేయ వచ్చునను తలంపుతో నతనితో సంతతము విద్యాప్రసంగములం గావింపుచు వినోదవిహారముల చేయుచు బరిహాసగర్భితములైన మాట లాడుచు భోజనభాజనములయందు సంగాంగమేళనం బాచరింపుచు అతని చిత్తవృత్తి ననుసరించి కొన్ని దినములు గడపినది

అతండును రాజభోగముల ననుభవించుచు సాయంప్రాతఃకాలములందు నశ్వశకట మెక్కి పట్టణమున నలుమూలలు విహరింపుచు నొకనాడా తలవరియొద్దకు బోయి తనయొద్ద లాగికొనిన తోలుజింక నేమిచేసిరని అడిగెను.

ఆతండయ్యా! అది యింతకాలము మాయొద్దనుండదు. ఆమఱునాడే వేలము, పాడితిమి. ఎవ్వరు తీసికొనిరో మాకు దెలియదని చెప్పెను. కందర్పుడు పదిదినములలో, నాభాషఅంతయు గ్రహించెను గనుక నాపట్టణ ప్రజలతో మైత్రిజేసి వారివారి