పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

94

కాశీమజిలీకథలు - మూడవభాగము

అన్యాయము గాదుకదా! నీవు మిగుల బుద్ధిమంతురాలవు నిజ మూహింపుమని యందు గుఱించి జరిగిన గ్రంథ మాసింధురగమన కిచ్చెను.

ఆచిన్నది అదిఅంతయుం జదివికొని అప్పా! తప్పుతీరుపు చెప్పితివి. అకారణముగా దనకుపకారము చేయబూనినవానికొక విదేశస్థుడు విషమిడె నన్న నెట్లు నమ్మదగియున్నది. అయింటిలోనివారెవ్వరో యీ పనిచేసి ఈ క్రొత్తవానిమీద ద్రోసి రింతియ నిక్కువ మారహస్యము నేను బయలుపఱచెద జూడుమని చెప్పి అప్పుడే మమ్ముల నిచ్చటికి బంపి తా నాచనిపోయిన అధికారి యింటికి బోయినది. యిదియే వృత్తాంతము వీని అదృష్టమెట్లున్నదో తెలియదని చెప్పిరి. వారి భాష గొంచెము కొంచెము తెలియుచుండెను. కావున కందర్పు డామాటలన్నియు గ్రహించి రాజపుత్రిక మిక్కిలి సూక్ష్మబుద్ధిగలదని మెచ్చుకొనియె.

ఆదూతలట్లు మాటాడుకొనుచు నాకందర్పుని రాజసభకు దీసికొనిపోయి రాజు సింహాసనమున కెదురుగా నిలువంబెట్టిరి యింతలో రాజపుత్రిక మృతుండైన అధికారి యింటికి పోయి యా యిల్లంతయుం బరీక్షింప గందర్పుడును ఆచిన్నదియు సంజ్ఞాగ్రహణార్థమై వ్రాసికొనిన చిత్రపటంబులు మాత్రము దొరికినవాటిం గైకొని యాచిన్నది అందలి విశేషముల గ్రహించుటకై కొందఱ గూఢచారుల నియోగించి వెంటనే రాజసభకు వచ్చి తండ్రిప్రక్కను గూర్చుండి తనయెదురనున్న కందర్పు నాపాదమస్తకముగా శోధించి తదీయ రూపవిశేషమున కచ్చెరువందుచు దండ్రితో నిట్లనియె.

తాతా! ఈపురుషరత్న మేదేశమునకో ప్రభువు. కాని సామాన్యుడుకాడు. ఈతనిహృదయము కరుణాభూయిష్టమై యుండక మానదు ఇట్టివాడిట్టి క్రూరకృత్యమును జేసియుండడు నిష్కారణము దొంగసాక్ష్యముల నమ్మి వీనికి నుఱిశిక్ష విధించితివికదా! దీనినే రాజులకు రాజ్యాంతమున నరకమని చెప్పుదురు. ఇందలి నిజము నీకుబట్టి యిచ్చెదజూడుమని బల్కుచు దనకువచ్చిన భాషలన్నిటిచేత అతనిం బల్కరించినది అవియేమియు అతనికి దెలిసినవికావు. కాని యానమ (కస్త్వం) అని సంస్కృతము మాట్లాడినట్లుగా స్ఫురించి యోహో! దేవభాష యీ యోషామణికి వచ్చునట్లున్నది. అట్లయిన నీయాపద దప్పిపోయినట్లే తలంచెదనని సంతసించుచు -

హిమాచల దక్షిణదేశీయః కశ్బిద్రాజపుత్రోహం

అనియుత్తరము చెప్పగా నామత్తకాశిని శిరము గంపించుచు "తవదుదంత మాద్యంత ముచ్యతాం" అనిపలికినది అప్పుడతండు తాను దేశయాత్రచేయుచు నాపట్టణమునకు వచ్చుటయు రాజభటులు తన్ను బట్టుకొని తలవరి కొట్టమునకు దీసికొనిపోయి చెరసాలం బెట్టుటయు, వొక అధికారియు, చిన్నదియు బండిమీదవచ్చి తన్ను విడిపించి తనయింటికి దీసికొనిపోయి విందుచేయుటయు రాత్రి యా కనకగాత్రి వచ్చి