పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

86

కాశీమజిలీకథలు - మూడవభాగము

వులే కాని మరియేమియును లేవు. అట్టి మహారణ్యము మీదుగా నరుగునపుడు తన జింకను భూమికి దాపుగా బోనిచ్చుచు భయంకరములైన వింతమృగములంజూచి సింహనాదంబు సేయుచు నపూర్వతరుకుసుమసౌరభవిశేషం బాఘ్రాణించి యాఘ్రాణించి యానందించుచు నున్నతవృక్షాగ్రశాఖాఫలంబులం గోయుచు నెడనెడ క్షుద్రమృగారవంబు లాకర్ణించి యుపరిభాగంబున కరుగుచు నీరీతి నుద్యానాంతరంబునంబోలె నక్కాంతరంబు వినోదవిహారప్రచారంబుల నతిక్రమించి మించిన మురిపెముతో నరుగుచుండ గొండొకవడికి ననంతజనాకీర్ణంబగు నొకపట్టణం బతనికి నేత్రపర్వతమై పొడకట్టినది.

తదుపరిభాగంబున నాజింక నాపి అప్పట్టణము నలుమూలలు కలయ గనుంగొని అంతంబు గానక యోహో! యిది యీ దేశమునకు రాజధాని కావచ్చును, ఈ దేశవిశేషములన్నియు నిందుండును. ఇందుదిగి యిచ్చటి వింతలంజూచెద నిచ్చటి యాచారములు కడువ్యత్యయములుగా నుండకమానవు. మా దేశమిచ్చటికనేక సహస్ర యోజనములుండును. అన్నన్నా! యింకను జాముపొద్దున్నది. ఎంతలో నెంత దూరము వచ్చితిని ఈయంత్రము చేసినవాని నెంత మెచ్చుకొనినను మెచ్చుకొనవచ్చు నని పలుదెరంగులదలంచుచు నల్లన నప్పట్టణము లోనికిం దిగి యాజింక యెడమచెవిలోని చీల తీసినంతగాలిపోయి అది తోలువలె సురుగుటయుం జుట్టుచుట్టి చంక నిడికొని అందొక వీథింబడి అరుగుచుండెను.

చండికకథ

పదిఅడుగులు నడచినతోడనే పురరక్షకు లడ్డమువచ్చి అతని విదేశస్థునిగా నెఱింగి నీ వెవ్వడవు? ఈ పట్టణమున కెప్పుడు వచ్చితివి. సొమ్ము చెల్లించిన చీటిం జూపుమని అడిగిరి. వారి భాషయేమియు నతనికి దెలిసినదికాదు. అప్పుడతండట్టి మాటచెప్పగా నతనిమాటలు వారికి దెలిసినవికావు వారట్లు రెండుమూడుసార్లు లడిగియు దగిన యుత్తరము రామింజేసి కినియుచు దలవరియొద్దకు బోవుదము రమ్మని చేయిపట్టుకొనిరి

అయ్యో! ఇదియేమి అన్యాయము. నేనేమినేరమును జేసితిని నాచేయిపట్టుకొంటిరేమిటికి? విడువుడు విడువుడు అని చేయి విదలించి లాగికొనగా జంకనున్న తోలు జింక జారి క్రిందబడినది. దాని జూచి యోహో! యీతండు తోలుకూడ దెచ్చి ఉన్నాడు. దీనికిని జీటియుండవలయు నిది రెండవ నేరమని యొండొరులు సెప్పుకొనుచు నత్తోలుంగైకొని మాసభకు పదమని త్రోయ దొడింగిరి. తాను జేసిననేర మెద్దియో తెలియక వారి నిందించుచు జింకనిమ్మని బలవంతము చేయుచు బెనకువ చేయదొడంగెను. కాని వాండ్రు పదుగురుండుటచే లక్ష్యము సేయక అతని బలాత్కారముగా తలవరికొట్టము నొద్దకు లాగికొనిపోయిరి.