పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

కాశీమజిలీకథలు - మూడవభాగము

చేయించి అమ్ముసలివానిచేత నంపించెద. దాని నీగదిలో నిది యుండినచోట వ్రేలం గట్టుము. అదియే యిది అనుకొని మీతాత శంకించడు. దీన మనకు గార్యసిద్ధి అగునని చెప్పి యాపడితి నొప్పించి మెల్లన నాయిల్లు వెడలి యధాప్రకారము తాళములు వేయించి తిరుగా మేడమీదికి వచ్చెను. అప్పటికి వేకువజామగుటయు నానృపతిసూనుండు పండుకొనక అక్కనకగాత్రిం జూచి సానునయముగా నిట్లనె. తరుణీమణి యెవ్వరికిం స్వజాతియువతిం బెండ్లియాడిన పిమ్మటంగాని అన్యజాతి నాతిం బరిణయంబగుట కధికారములేదు. వేగిరించి అట్లు కావించినచో నప్పడతికి బొడమిన సంతానమునకు బుత్రత్వసిద్ధి లేదు. గూఢజు లని పిలువబడుదురు. కావున నిప్పుడు నీతో గ్రీడింప సమ్మతము లేకున్నది. నేనొక హాయనములోపలనే పట్టాభిషిక్తుండ నయ్యెద తోడనే నిన్ను విధివిధిం ద్వితీయపత్నిగా శ్వీకరించెద ఇమ్మాట శపథేరితమని నమ్ముము అని ముమ్మారు పలికి అక్క.లికిచేతం జేయివైచి యొప్పించి అమ్మించుబోడి సంతసించిన వెనుక దీపము వెలుంగున నజ్జింక బూరించు విధానంబంతయు వెండియు జదివి విస్మయముతో, అతివా! చూచితివా! ఈజింక కుడిచెవిలోనున్న బిరడా తీసి నోటిగాలిచే బూరించిన గుఱ్ఱమువలె నిలువంబడునట పిమ్మట అబ్బిరడా బిగియుంచి యెక్కి, యేచెవి యెట్లునొక్కిన నావైపుగా నెగిరిపోవునట. శిరంబు మీద నున్న చీలయొక్క కుడియెడమ త్రిప్పులవలన బైకిని గ్రిందికిని నడుచును. అందున్న రెండవ చీలవలన మనకు గావలసినంత వేగము పెట్టుకొనవచ్చును. యెడమచెవిలోని బిరడా తీసివేసినచో వట్టితోలువలె నుండునట. ఆహా! ఇది విశ్వకర్మవలన చేయబడినది. కాని మరియొకటి కాదు. ఇట్టి అద్భుతవస్తువు నీ సాంగత్యమున నాకు లభించినది. నీయెదుటనే పరీక్షించి చూచెదనని అప్పుడందున్న శాసనప్రకారము పూరించిన నెక్కుటకు వీలగునట్లు బిఱ్ఱబిగిసి నిలువంబడుటయు దాని నిరువురు గైకొని నిరావరణసౌధంబునకు దీసికొనిపోయిరి.

అప్పు డక్కందర్పుండు సుభద్ర కపోలములపై వ్రేళ్ళు విరిచి తరుణి! పోయివత్తు అనుమతి యిమ్ము వెండియు రేపు వత్తునని పలుకుచు చిన్నబోయి యాచిన్నది చూచుచుండ నాజింక నెక్కి కుడిచెవి నొక్కుటయు అది రివ్వున నెగసి గగనంబున నిలువంబడినది.

అందున్న మరలన్ని యు ఆతండు గ్రహించుటంజేసి దాని మెల్లగా నడిపించుచు అల్లన దనమేడమీద వ్రాలెను. అంతలో దెల్లవారుటయు ఆతం డుల్లంబున సంతసము వెల్లి విరియ అప్పుడొక చర్మకారునిం బిలిపించి దానిపోలికగా వేరొకటి చేయించి అది యాదినము సాయంకాలమున గూలివానియొద్దకు దీసికొనిపోయి వాని కిట్లనియె.