పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

74

కాశీమజిలీకథలు - మూడవభాగము

అతనికి ముదిమియం దొకపుత్రు డుదయించెను. రూపలావణ్యాదివిశేషములు చూచి దైవజ్ఞులు వానికి గందర్పుండని పేరు పెట్టించిరి.

ఆ రాజకుమారుని కైదేడుల ప్రాయమువచ్చినతోడనే చదువనేయుటయు సూక్ష్మబుద్ధి అగు నబ్బాలుం డశ్రమముగా బదియారేడుల ప్రాయమువచ్చు లోపలనే పెక్కువిద్యలు గ్రహించెను.

ఒకనాడతని యుపాధ్యాయుడు వానికి భూగోళవిషయమును చెప్పుచు బెక్కురంగులతో నొప్పుచున్న యొకపటమును జూపెను దానిఁజూచి యా రాజపుత్రుడు ఆచార్యా! యీ పటం బిన్నిరంగులతో నొప్పుచున్న దేమని అడిగిన నతఁ డిట్లని చెప్పందొడంగెను.

రాజపుత్రా! చూడు మీ పచ్చని రంగుగల ప్రదేశమంతయు భరతఖండము ఇందుగలయేబదియారు దేశములకు గుఱుతులుగలవు. నిరూపించి చూడుము మఱియు సన్నని గీటులన్నియు నదులు, ఇది గోదావరి, ఇది గంగ, ఇది కృష్ణవేణి, ఇది కావేరి, ఇది తుంగభద్ర, పేరులు వ్రాయబడియున్నవి పరికింపుము. ఏమియు వ్రాయక విడిచినది సముద్రము. ఇదిగో ఉత్తరముగా నున్న యవి హిమవత్పర్వతములు, పూర్వపర సముద్రములకు వ్యాపించియున్నవి అరయుము. ఇదిగో మూలగా నున్నది పారసీక దేశము. ఆ పశ్చిమోత్తరమున గనంబడుదేశమంతయు హూణులది. అందున్నవారు మంచి బుద్దిశాలురు. సృష్టికి బ్రతిసృష్టి జేయంగలరు. కనంబడునవి ద్వీపములన్నియు పేరుపేరు నిరూపించి చెప్పెను. అప్పుడా రాజకుమారుం డార్యా! వీనిలో మనదేశ మెచ్చట నున్నదియో చూపింపుమని అడిగెను.

అప్పు డుపాధ్యాయుండు నవ్వుచు వత్సా! మనది పాండ్యదేశములో అంతర్భాగము. అల్లదిగో! కపిలవర్ణముతో మచ్చెవలె గనంబడుచున్న యాచిన్నప్రదేశమే మనదేశమని చూపుటయు నా కందర్పుడు ముక్కు మీద వ్రేలువైచుకొని యేమేమి? ఇదియా మనరాజ్యము. చాలుజాలు యీ మాత్రమునకే మనవారు చక్రవర్తులమని గర్వపడియెదరు. గుమ్మడికాయలో నావగింజంతయైన లేదే! అయ్యారే? యెంతభూమి యున్నది. యాచార్యా! ఈపటము జూచినది మొదలు వెర్రి యెత్తుచున్నది. నిత్యము వందిమాగధులు చేయు స్తోత్రబాఠములు విని యథార్థము లనుకొని నేనే యీభూమి కంతయు ప్రభుండనని గర్వించుచుంటి నని తెలిసినది. యెవ్వరును ప్రభువులమని గర్వపడవలసిన అవసరము లేదు. సర్వేశ్వరుడే అందరకు ప్రభువని పలుకుచు వెండియు నిట్లనియె.

ఆర్యా! భగవంతుని సృష్టివైచిత్ర్యంబు మిక్కిలి అద్భుతమైనది. ఒక దేశములో నున్న వింతలు మఱియొక దేశములో లేకుండును. అయ్యారే ఈ దేశములన్నియు జూచినచో నెన్నిరోజులు బడునో! ఏలాటి విశేషములు చోద్యములు చూడ నగునో! యేరీతిపొలంతుల వీక్షింపవచ్చునో! యెట్టి విద్వాంసులు కాన్పింతురో? యెఱుంగరాదు గదా! సీ! కూటస్థకూర్మమువలె స్వదేశమును విడువక తనకుంగల