పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

72

కాశీమజిలీకథలు - మూడవభాగము

వలగొని అందులో దుమికినది. ఆసతీమణి పాతివ్రత్యమహిమచే అగ్నిలోబడియు దగ్ధముగాక మెఱుగు పెట్టినబంగారమువలె నొప్పుచు నెల్లరకు దనచిత్తనైర్మల్యము వెల్లడిచేయుచు అయ్యగ్ని చల్లార్చినది. అప్పుడు ప్రజలు కరతాళములు తట్టుచు జయజయధ్వనులు గావించిరి.

అప్పుడు సీతవలెనే పాతివ్రత్యమహిమచే ప్రకాశింపుచున్న యాసునీతిని జయభద్రుడు మిక్కిలి సంతోషముతో బోయి చేయిపట్టుకొని యెల్లరు చూచుచుండ గోటలోనికి దీసికొనిపోయెను. ఆమెను బట్టమహిషిగా జేసికొని హైమవతి యుపచారములు చేయుచుండ నిరువురు భార్యలతోడను అతండు పెద్దకాలము పుడమి సౌఖ్యముల బొందగలిగెను.

వత్సా! నీవు చూచిన చిన్నది యాసునీతి. ఆనాటి పాతివ్రత్యమహిమచే అగ్నిలో బడినను దగ్దముకాక నిలిచినది. ఈ కధావిశేషము వినినవారికి నాయుర్భాగ్యములు వృద్ధియగు నిక లెమ్ము వంటచేసికొని భుజింపవలయు నని చెప్పిన వాడు మిక్కిలి సంతసించుచు అయ్యతీశ్వరుని అనేకప్రకారముల స్తుతిజేసెను. పిమ్మట మణిసిద్ధుండు లేచి స్నానముజేసి వంటచేసికొని భుజించి వానికి పెట్టి సంతుష్టి వహించి తదనంతరప్రదేశమునకు బయనమయ్యెను.