పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70

కాశీమజిలీకథలు - మూడవభాగము

తునికి నమస్కరించి యిట్లనియె. చెల్లెలా! నావల్లభుని పాదపద్మము నుల్లమునం బెట్టుకొని దైవముఖము సూచుచు నిక్కము వక్కాణింపుచున్నదాన. నా ప్రియుండు మొదట వేశ్యాలోలుండై నాయం దప్రియుండై యుండె. దానికి సుమిత్రుండె సాక్షి ఒక్కనాడు భ్రమరిక అను నాచేటిక వశ్యౌషధి యొకటి దెచ్చి నా కిచ్చి మగని శిరంబున నిడుమని చెప్పినది నేనును మొదటి నట్టి ప్రయత్నముతో బోయితినిగాని యమ్మనోహరునిం జూచినంత వెరపున నామం దిడక మరలి వచ్చి అప్పసరు నొకపుట్టలో బోసితిని.

ఆ రాత్రి అది యేమిమహిమయో తెలియదు. నామనోహరుడు చక్కనివేషముతో నాయొద్దకు వచ్చి నా యిష్టముల దీర్చెను. అది మొదలు ప్రతిదినము వచ్చుచు రత్నమండనముల దెచ్చి నాకిచ్చుచు నా అభీష్టములు దీర్చుచుండెను. మఱికొన్ని దినము లఱిగినంత సంతతము నాయొద్దనే నివసించి నేను గోరిన వస్తువాహనము లిచ్చుచు విప్రకోటిం దనుపుచుండెను

మఱియు నడుమ నొక్కవిశేషము గంటి నాకర్ణింపుము. నే నొక్కనాడు రతిక్రీడల నలసి సొలసి నిద్రించితిని ఎద్దియో యకారణముగా నాకు మెలకువ వచ్చినది. అప్పుడు నేను లేచి చూచువరకు నామనోహరుడు శయ్యపై సహస్రముఖముల శేషుడువలె తోచి యుండెను. అప్పుడు నేను భయపడుచు గన్నులు మూసికొని యుచ్చస్వరంబున నరచినంత నొయ్యన నతండు లేచి యథాప్రకారరూపముతో నొప్పుచు “ఏమి! ఏమి! కామినీ! అట్లడలెదవని నన్నూరడించెను. '

నేనును గన్నులు తెరచిచూడగా బూర్వపురూపమే అగుపడెను. కాన వెర పుడిగి దరికరిగి ప్రాణేశ్వరా! మీకు నిద్రలో నట్టి వికృతరూవము వచ్చుటకు గారణ మేమని అడిగితిని అప్పు డాయన నవ్వుచు జవ్వనీ! అది నా వికృతరూపము కాదు. నీవు నిద్రలో లేచి యట్లు చూచినట్లు పలవరించితివి. స్వప్నములో ననేక వికృతాకారములు గనంబడుచుండును. దానికి శంకలేల? భయము విడువుము. అని నన్నూరడించెను.

నేనును నట్లు కాబోలు ననుకొని యధాప్రకారము పతిసేవజేయుచుంటిని. ఇంతకన్న నేవిశేషము చూచి యెఱుంగను. మీతో నిజము చెప్పితివి. తరువాత మీకెట్లు తోచిన నట్లు తలంచుడని పలికెను.

సునీతి మాటలు విని హైమవతి, శిరఃకంపముజేయుచు ప్రాణేశ్వరా! నిక్కము దొరికినది. సునీతియెడ నించుకయు దోషములేదు ఆ సాధ్వీమణిని నిందించినవారికి గన్నులుపోగలవు. ఈ యింద్రజాల మంతయు వశ్యౌషధిమహిమ వలనం బుట్టినది. ఆ సునీతి విఖ్యాతికిని అదియే కారణము. ఆపస రీబిసరుహాక్షి పుట్టలో బోసినప్పుడు పాతాళలోకవాసిఅగు శేషుని శిరముపై బడనోపు దాన వశ్యుండై కామరూపంబున నతండు వచ్చి యిమ్మచ్చెకంటిం సంతోషపరచుచున్నవాడు. సామాన్యపురుషుల కిటువంటి దివ్యరత్నభూషణము లెచ్చట లభ్యమగును, నిద్రాసమయమున గామ