పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

కాశీమజిలీకథలు - మూడవభాగము

మఱతుము. వీనికి తప్పక భూతముసోకిన మాట నిక్కువమని పలుకుచుండగాఁ ప్రతిహారి వచ్చి దేవా! యవధారు అమరావతీ మంత్రపాలమహారాజు కూఁతురు హైమవతిఅఁట. తనప్రాణేశ్వరుండైన జయభద్రుం డున్మత్తుండై యున్నవాఁడను వార్తవిని యుచితపరివారముతోవచ్చి ద్వారమున నున్నది వల్లభుం జూచుటకు మిక్కిలి తొందరపడుచున్నది. దేవర యానతి యేమని అడిగెను. ఆద్వారపాలుని మాటలు విని యారాజు విస్మయావేశ హృదయుండై సుమిత్ ! ఈ చిత్రము వింటివా! ఇప్పుడు నీతో చిరంజీవి చెప్పిన మాట లన్నియు నిక్కువమగునట్లే తోచుచున్నది. మంత్రపాలు గూతురు హైమవతి మావత్సను, బతిగా వరించినట్లు యీ ప్రతిహారి వచనంబున దేటయగుచున్న యది. కానిమ్ము ఆ సాధ్వీతిలకమువలన సర్వమును దెలిసికొని తరువాత విచారింతము. అనియాలోచించుచు వేగమ యాగజగమనను ప్రవేశపెట్టుమని ద్వారపాలుని కుత్తరము జేసెను.

ఆవేత్రహస్తుడు వడిగా బోయి అచ్చేటియుం దోడ్కొనివచ్చి జయభద్రు డచ్చట నున్నవాడని పలుకుచు నచ్చట విడిచిబోయెను. హైమవతి బద్ధుండైయున్న జయభద్రునిఁజూచి. హా! ప్రాణేశ్వరా! నీవెట్టి అవస్థ అనుభవించుచుంటివి. నేను పోవలదని యెంతచెప్పినను వింటివికావు అయ్యయ్యో! నిన్ను దయ్యమిట్లు సేయ నేమియపకారము సేసితివి? అచ్చట మా చుట్టము లందఱున్నారని యత్యాతురఁతో వచ్చితివే? బుద్ధినైపుణ్యముచేత బలవంతులగు శత్రువులను వంచించిన నీయూహ లన్నియు నెందుబోయినవి. కటకటా! నూతిలో బడిననాకు దెప్పవై యుద్ధరించిన సుకృతమైనను నిన్ను గాచినది కాదే అన్నన్నా. అమరావతి ప్రజల దురదృష్టము కాబోలు స్వల్పకాలము పాలించినను వారిని మిక్కిలి రంజింపజేసితివి. అని యీరీతి నతని వృత్తాంతమంతయును జెప్పుకొనుచు శోకింపదొడగినది.

జయభద్రు డాకురంగనయనం జూచి, అయ్యో! తొయ్యలీ! నీవు విచారింపకుము నా కేమియు బిచ్చియెత్త లేదు భూతమును సోకలేదు. నాచిత్తము స్వస్థతగానే యున్నది. వీరిట్లు నన్నూరక నిర్బంధించుచున్నారు. కారణమేమియో తెలియదు నీవైనను వీరికి జెప్పి నన్ను విడిపింపుము. మనదేశమునకు బోవుదము ఆని పలుకగా విని అవ్వనిత విభ్రాంతయై, మామగారితో నిట్లనియె.

ఆర్యా, నావల్లభునికి బిచ్చియెత్తినట్లు మీరెట్లు నిశ్చయించినారు ఆయన మాటలు తేటగనేయున్నవే! వేరెద్దియేని కారణముచేత నిట్లు బద్దుంజేసితిరా! నిక్కువ మేదియో చెప్పుడు. పతివ్రతయైన సునీతి మా అక్క యెక్కడనున్నది. అక్కలికి మా ప్రాణేశ్వరుని యిక్కట్టులకు సమ్మతించినదా! అచేడియ వాడుక పుడమిఅంతయు వ్యాపించినదే! అని అనేక ప్రకారముల దైన్యముగా బలుకుచున్న యాచిన్నదాని వచనంబులన్నియు విని యారాజు మాటలచేత దద్వృతాంతమంతయు దేటపరచుకొని విభ్రాంతచిత్తుండై యున్మత్తుని క్రియ నొక్కింతసేపూరకుండి శిరఃకంపము చేయుచు నాజేడియ కిట్లనియె.