పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

66

కాశీమజిలీకథలు - మూడవభాగము

నట్లున్నది. ఈ పుంశ్చలి మాటవిని యిచ్చటికి వచ్చితిరేల? నా మాటలన్నియు యథార్థములు: నే నున్మత్తుడను కాను నన్ను నమ్మించుటకై ఈకొమ్మ యిట్లను చున్నది. మీరే యాలోచింపుడు నేను తనతోనున్నట్లు చెప్పుచున్నది. యెప్పుడేని నన్ను మీరిచ్చట జూచితిరా? నే నడవుల పాల్పడిపోయి నేటికి వచ్చితిని. నన్ను మీరందరు అవమానింపనక్కరలేదు. నాకును నీపాటి రాజ్యముగలిగియున్నది లెండు అని వారితో మాటాడగా వారికి అతనిమాటలు విపరీతముగాఁ దోచుటచే బిచ్చియెత్తినట్లే నిశ్చయించిరి.

అప్పుడు జయభద్రుని తల్లి మిక్కిలి పరితపించుచుఁ బుత్రకునిపై బడి, అయ్యో! కొడుకా! నీ విప్పుడు నాయొద్దకువచ్చి పల్కరించినను మాట్లాడితివికావు. అప్పుడే నాకనుమానము గలిగినది. నన్ను జూచినపుడెల్ల అతివినయముతో మాట్లాడు వాడవు. నేఁడు నీ కెవరో భూతమును బెట్టియుందురు. నాముద్దలతండ్రీ! నీ చిత్త మెట్లు స్వస్థతనుజెందునో తెలియదుగదా యని పెక్కుగతుల విలపింపఁ దొడగినది.

అప్పుడు జయభద్రుడు తెల్ల బోవుచు తల్లితో ఔను అమ్మా నేను బెక్కు దినములు పరదేశములోనుండి నీయొద్దకు వచ్చినందులకు దిన్నగా మాట్లాడినాను కాను. ఇప్పుడు నాభార్యచెప్పిన కపటపుమాటలు విని నీవుకూడ నాకు బిచ్చియెత్తినదని యేడ్చుచున్న దానవు చాలుజాలు నాకు మిమ్మునందఱిం జూడఁ బిచ్చియే యెత్తు చున్నది. ఒకరై నను నన్ను గ్రొత్తగా బెక్కిడుములు పడివచ్చితినని పరామర్శింపరైరి. ఇప్పుడీ ఱంకులాడిమాటలు నమ్మి గంతులు వైచుచున్నారు పో పొండు నా యొద్దకు రాకుడు నాతో మాటాడవద్దని పలుకగా మఱియు బిచ్చియెత్తినట్లు నిశ్చయించి అయ్యో! ఇఁక నేమియున్నది. వీనిమాటలన్నియు విపరీతముగానే యున్నవి. వేగము వైద్యులు చికిత్సచేయరో అని ఆతనితల్లి తొందర బెట్టదొడంగినది

అప్పుడు వైద్యు లుప్యగ్రచిత్తులై తత్తరముతో నతని బలాత్కారముగాఁ బట్టుకొని పైత్యోద్రేక ముడుగునట్లు చికిత్సచేయదొడంగిరి.

జయభద్రుడు పకపకనగుచు అయ్యో! నిష్కారణము నాకు బిచ్చియెత్తినదని వైద్యముచేయుచు నన్ను వేపుచున్నారే. ఈలాగునని తెలిసినచో నేనిచటకు రాకయేపోవుదును తెలియకవచ్చితిని. నన్నునిడువుడు. నాదేశము నేను బోయెదనిఁక నెన్నడును రాకుండ చేయుచున్నారని పలుకగా విని భూతవైద్యు లతని తండ్రితో నిట్లనిరి.

రాజా! వీనిమాటలు వినుచుంటిరికదా! వీనికిదిపిచ్చికాదు గాలిసోకినది. ఎఱుగకవచ్చితిని. విడువుడు. ఇకరాను అనుమాటలు భూతాలాపములు కాని యున్మత్త వచనములుకావు కావున వీనికి భూతవైద్యము చేసెదమని చెప్పిన నతండును అట్ల కాదలంచి యావైద్యము వారిచేత చేయించెను. అతని బందీగృహంబునం బెట్టి భూతవైద్యులు భూతమా! నీవు మా రాజపుత్రు విడువుము. లేకున్న నిన్ను కట్టివైచి శపింతుమని మంత్రము లుచ్చరించుచు, బెత్తములచే నతని గొట్టదొడంగిరి.