పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హైమవతికథ

49

మును దిగి జయభద్రుఁ డయ్యతివతో నిట్లనియె. తరుణీ! మనము జనపదమునకు వచ్చితిమి. నీవు గుర్రముమీద రమ్ము. నేను నడచిపోయి యొక తావు చూచెదను. వంటజేసి భుజింతము. అనుటయు నత్తన్వియుఁ దటాలున గుర్రముదిగి తానుగూడ నడచివచ్చెదనని చెప్పుచు నాగుర్రపుకళ్ళెమును జయభద్రుని కందించెను.

అప్పుడతం డాగుర్రపుకళ్ళెముం గైకొని మెల్లగా నడచుచు నచ్చటి గ్రామమునకు బోయి అందొకచోట బసఁజేసి రెండుదినములనుండి భోజనము లేమింజేసి నాడు భోజనసామగ్రి అంతయు యాచనమూలముగాఁ దెచ్చి హైమవతి కిచ్చెను.

హైమవతియుఁ జక్కగా వంటజేసి అతనికి బెట్టి తాను భుజించి మార్గాయాసమును దీర్చుకొనియెను. అచ్చటనున్న వారందఱు వారిని దంపతులని నిశ్చయించి బ్రహ్మదేవుని కూర్పును గుఱించి మిక్కిలి స్తుతిఁజేయఁ దొడంగిరి.

హైమవతి కోరుటచే జయభద్రుడు అమరావతి నగరమునకు బోవుటకు నిశ్చయించి యవ్వీటికి మార్గమడిగి తెలిసికొని అనతిదూరములోనున్న అప్పురమున కరుగుచుండ నొకనాడు దారిలో నొకపట్టణమును గనంబడినది.

అందుఁ బ్రసిద్ధిచెందిన యొకసత్రములో నివసించి వంటజేసికొని భుజించి చక్కగా వెన్నెల గాయుచుండగా వారిరువురు నోరగానున్న యొక్క అరుగుమీఁద బరుండి యిష్టాగోష్టి వచనములచే గొంతసేపు వెళ్ళించిరి. మఱియు నాసత్రంబున కాదివసంబున నానాదేశపు బ్రాహ్మణులు వచ్చిరి. వారందఱు భోజనముచేసి అరగు మీద బండుకొని యొండొరులిట్లు సంభాషించుకొనిరి.

రామావధాని --- ఆకూర్చున్నవారెవ్వరు? ఏ యూరు బాబూ కొంచెము పొడుము పెట్టెదరా?

సుబ్బావధాని - నా పేరు సుబ్బావధాని అంటారు. మాది యుజ్జయని పొడుము సరిపోయినదండి.

రామా - అయ్యో నాముక్కు దిబ్బడి వేసినదండి. కొంచెమైనను లేదా? అయినా కాయ యీలాగున యిస్తారా? అడుగుననేమైనా యున్నదేమో చూస్తాను.

సుబ్బా - లేదండి, గీకిగీకి, యిప్పుడే, పీల్చుకున్నాను.

అప్పయ్యశాస్త్రి - ఇదిగోనయ్యా! నాయొద్దనున్నది. పాపమెంత బాధపడు చున్నావో!

రామా - పుణ్యాత్ములెవ్వరు?

అప్ప - నేను అప్పయ్యశాస్త్రిని. (అని పొడుము పెట్టుచున్నాడు)

రామా - ( పొడుము పీల్చుకొని) అప్పయ్యశాస్త్రిగారా! తమరెచ్చటనుండి వచ్చుచున్నారు?

అప్పయ్య - మేము పదుగురుము గూడి యీనడుమ దేశయాత్రకు వెడలి తిరుగుచు అమరావతిలో గొప్పవివాహము జరుగునని అచ్చటికిఁ బోయితిమి.

రామా - అచ్చట సంభావనాది సత్కారములు అధికముగా జరిగినవియా?