పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

కాశీమజిలీకథలు - మూడవభాగము

చీకటిపడుచున్నది. నాకు గ్రూరమృగములు వచ్చునని వెరపుగానున్నది. ఈ రాత్రి యెచ్చట బరుండను? నీపెట్ట నన్నట్ల నుచున్న దేమి ఎచ్చటికిబోయినది? మరల నీ రాత్రి వచ్చునాయని అడుగుటయు నక్కిరాతుఁడిట్లనియె.

“పెట్టా! నీకేమియు భయములేదు. నీవు పులిచర్మమును గప్పికొనుము. నీ దాపునకే మృగమునురాదు నా పెట్ట కల్లుద్రావి యట్లరచుచున్నది. యెచ్చటకో బోయినది రేపదియే వచ్చును. సుఖముగా నిద్రఁ బొమ్మని యోదార్చి యాచర్మము తెచ్చి నాకిచ్చెను.

దుర్గంధయు క్తమగు నాతోలు ముట్టుట కేవగించుచు నెట్టకే వెరపుపెంపునఁ జేసి దానిం గప్పుకొని పరుండి నిద్రపట్టక నాయవస్థ యంతయు స్మరణకు దెచ్చుకొని పెక్కు దెరంగుల దలపోయుచుంటిని.

అట్టి సమయమున వాని యాలు, పదుగుండ్ర యమకింకరుల బోలువాండ్ర వెంటబెట్టుకొని అచ్చటకి వచ్చి, నా కాపురము పడద్రొబ్బిన రంకులాడి యిదియే యని వారికి నన్నుఁజూపినది.

ఆ క్రూరులు నన్నుఁజూచి నిందించుచు, వానితో ఓరీ! కులము మర్యాద విడిచి, మఱియొక దాని నుంచుకొని, పెండ్లామును జావమోదెదవా? దాని కెవ్వరు దిక్కు లేరనుకొంటివా? కులములో నీకుఁ దప్పు పెట్టించెదము. చూడుము. నీవు తీసికొనివచ్చిన చెడిపసంగతి యేమి చేయుదుమో చూడుము" అని అరచుచు, నన్ను బలాత్కారముగా లేవనెత్తి, కాళ్ళు కొందఱు, చేతులు కొందఱు పట్టుకొని రక్షింపుడు రక్షింపుడు అని కేకలు వేయుచుండగనే వినిపించుకొనక, భుజములపై నెత్తుకొని అతి వేగముగా, బరుగుపెట్టుచు నీ నూతియొద్దకు వచ్చి చావుము రండా! అని పలుకుచు నీ నూతిలో బడవేసిపోయిరి. తరువాయి వృత్తాంతము దేవర యెరిఁగినదే. ఆపత్సముద్రములో మునుగుచున్న నాకు నార్యునిఁ దెప్పగాఁ జూపిన భగవంతుని కనేకనమస్కారములు చేయుచున్నానని పలికి యానారీమణి యూరకుండెను. అని చెప్పి మణిసిద్ధుఁడు తరువాయి కధ పై మజిలీ యందిట్లు చెప్పదొడగె.

21 వ మజిలీ

శిష్యా! వినుము. ఆ జయభద్రుఁడు హైమవతి చరిత్ర అంతయును విని మిక్కిలి యాశ్చర్యమందుచు నౌరా! భగవంతుని సంకల్పము కడు విచిత్రమైనదే! మనుష్య సంకల్ప మేమియుఁ గొనసాగదు కదా? మానవు లూరక వెఱ్ఱిప్రయత్నములు స్వతంత్రులవలెఁ జేయుచుందురు. పురుషు డెన్నడును కర్తగాఁడు. అని చెప్పిన పురాణగాథ యథార్థమైన దగునని అనేక ప్రకారములఁ దలపోయుచు నాహైమవతి రూపలావణ్యాది విశేషముల కచ్ఛరువందుచుఁ బచ్చవిల్తుఁడు పూపుట