పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

కాశీమజిలీకథలు - మూడవభాగము

నున్న దుర్వాసన పొలసుకంపు ఏమందును. నిమిషము నిలువలేకపోయితిని. వెంటనే వెలుపలకు వచ్చి కక్కుకుంటిని.

అదిచూచి వాడు అయ్యో! పెట్టా! నీకు జబ్బుచేసినదాయేమి మాగొట్టములో మంచితేనెయున్నది త్రాగుమని పలుకుచు నొక చెట్టున వ్రేలంకట్టిన వెదురుగొట్టము దీసికొనివచ్చి యా తేనె కొంత యిచ్చెను.

నేను మిక్కిలి యాకలిగొని యుంటిని ఆమధువు గొంతబుచ్చుకొని వాడు తమ వృత్తాంతము లన్నియు జెప్పుచుండ వినుచు నాచెట్టుక్రింద గూర్చుండి ముందు కర్తవ్యమేమని యాలోచించుచుంటిని.

ఇంతలో నొక మూలనుండి నల్లని మొగము వికృతరోమములు మిట్టగుడ్లు మిట్టకు గలిగిన యొకరూపము మాయొద్దకు వచ్చుచున్నట్లు కనబడినది.

అదిచూచి నేను ఆమ్మో! మృగమేదియో వచ్చుచుచున్నది. చూడుము! చూడుము? లెమ్ము అనివానితో చెప్పితిని. వాడు ఆదిక్కు చూచి అయ్యో! నీకింత తెలియదేమి? అడవిమనిషివలె నుంటివే ఆ వచ్చుచున్నది. నాపెట్టయే మెకమనియద వేల? జడియకుమని పలుకగా నేనును వెరగంది చూచుచు గొంతవఱకు నమ్మలేదు.

అదియు సమీపించిన కొలది నిరూపించిచూడ మనుష్యజాతి అని తెలిసినది. ఆహ! దానిరూప మేమని చెప్పుదును మహాజనునికి గూడ నవ్వుపుట్టించక మానదు. అదియొకరీతి యాకు పుట్టముగా గట్టికొనియెను. అదియు వడివడివచ్చి యా డొంకలోపలకుబోయి నలుమూలలు దిరిగి మరల వెలుపలకువచ్చి యేమిదొరా! మాంస మేమియుం నీవేళ దీసికొనిరాలేదా ? అని అడగినది. వాడును భయపడుచు పెట్ ! ఈ దినమున నేమృగము గనఁబడలేదు. పెద్దతడవు ఎరబన్ని మాటులో గూర్చుండి చివరకూరకయే యింటికివచ్చితినని చెప్పెను.

అప్పుడది మరలయగునుకాని పిశాచమువలెఁ గూర్చున్న యీ పెట్ట యెవ్వతియె; యెచ్చటనుంచి తీసుకొనివచ్చితివి? నన్ను జూచి యాలాగున బెదురుచున్న దేమి.? తనపాటి అందము నాకు లేదనుకున్నదా నిజము జెప్పుము లేకున్న నిన్ను ను దానిని, లేవగొట్టి వేయించెద జూడుమనుటయు అక్కిరాతుడు భీతునఁబోలె మెల్లన నిట్లనియె.

పెట్టా! నేను నిజము చెప్పెదను. వినుము నేను మాటులో గూర్చుండి మృగములరాక నిరీక్షించుచుండగా నొకపులి గనంబడినది. అని అర్దోక్తిగాజెప్పి నాలుక గఱచుకొనుచు గొంతసేపూరకొని మరల లేదు లేదు. ఈపెట్ట అచ్చట కనంబడినది. కాదుకాదు. నేను దిగి వెళ్ళిచూచితిని ఉండుఉండు. మనయింటికి నేను రమ్మనలేదు. నిజమే అదియే వచ్చినది అనిబెదరుచు నొకమాట కొకమాట సందర్బములేనియట్లు చెప్పగా నారండ తలకంపించుచు అవును. నీమాటలు చక్కగా నున్న యవి. నాకనుమానము తోచుచున్నది. దీనినీవు తగులుకొని వచ్చినట్లు తోచుచున్నది. మనవారి కందఱికి జెప్పి నిన్ను గులములో వెలివేయింతుమ జూడుము. అన్నా! యెంతవాడ