పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హైమవతికథ

39

ద్వితీ - మనము పోవలసిన తావింకెంత దూరమున్నది.

తృతీ - మనకు గమ్యస్థానమొకటిగలదా? ఎచ్చట తెల్లవారునో అచ్చటనేయీ పెట్టెను విడగొట్టి సొమ్ముపంచుకొని యిండ్లకు పోవుదము.

ప్రధమ - ఇచ్చటగూడ జనులుందురు. తెల్లవారినచో నిచ్చట నెవ్వరేని చూచిరేని శంకింతురని నాయభిప్రాయము. తెల్లవారక పూర్వమే సొమ్ము పంచుకొనిన జక్కగా నుండునని యున్నది.

తృతీ - ఇప్పుడు తెల్లవారుట కెంత ప్రొద్దున్నది?

ప్రధమ - ప్రొద్దెక్కడ. తూరుపు తెల్లవారుచుండగనే, అదిగో! చూడుము వేగుచుక్క పొడిచినది.

తృతీ - అట్లయిన నిచ్చట బయలుగానున్నది. అందఱికి కేక వైచి చెప్పుడు ఇచ్చోట నిలిచి పెట్టెల శోధించి సొమ్ముదీసికొందము.

ద్వితీయ - అలాగుననే అనిపలికి అందఱకు దెలియ జేసెను. అప్పుడందఱు గుర్రముల నాపి దిగి యాచిక్కములన్నియువిప్పి పెట్టె లొకచోటకు దెచ్చిపెట్టిరి.

వాండ్రమాటలను చర్యలంజూచినంత నాస్వాంతమున నెట్లుండునో చింతింపుడు. అప్పుడు నేను మనసురాయిచేసుకొని ధైర్యమవలంబించుచు నిట్లు తలంచేతిని

శ్లో॥ నదైవం ప్రజ్ఞయాజాతు నచలోత్సాహశక్తిభిః
      న సహాయ బలై ర్వాపి కశ్చిదప్యతివర్తతే॥

లోకములో నెవ్వడును ప్రజ్ఞవలననుగాని ఉత్సాహశక్తి మొదలగు సహాయములవలనగాని, దైవము నతిక్రమించలేదు.

సుఖదుఃఖములు గలిగించు విషయమై దైవమునకు భారమేమియును లేదు. ప్రజ్ఞయు, శౌర్యమును, సంపదలకు గారణములని తలంతమన్నను ఒకానొకప్పుడు ప్రజ్ఞావంతులు శూరులును దుఃఖపడచుండుటయు మూర్ఖులు సుఖపడుచుండుటయుం దటస్థించుచున్నది. కావున సుఖదుఃఖములు దైవము గలుగ జేయుచున్నాడు. కాని వేఱొకటి కాదు. దీనికై విచారించిన నేమి లాభమున్నది.

ఆపత్తులయందును దైర్యమును విడువరాదనియుఁ బెద్దలు చెప్పుదురుకదా, ఇప్పుడు దైవము నన్నుద్దరింపఁ దలచుకొన్న మంచియే గలుగవచ్చును. కానిమ్ము తటస్థురాలివలె నాయవస్థ యంతయుం జూచుచుండెదనని యుపాధ్యాయుఁడు సెప్పిన నీతి అంతయు జ్ఞాపకము జేసికొనుచు మెడమీదఁ జేయు వైచుకొని యొంటిప్రాణముతో నుంటిని.

అట్టి సమయములో అందరు గుర్రములమీదనున్న పెట్టెలందింపుకొని అందున్న సువర్ణభూషణములు రత్నమండనములు, రాసులుగాఁ బోసికొని పంచుకొనుచుండిరి. మఱియు నన్నెక్కించుకొన్న రౌతు వెనుకటి దెస గుర్రము దిగి యేమిటికో అవ్వలకుబోయి మరల రాలేదు. దానంజేసి యాగుర్రము, అచ్చట నిలువక గ్రాసాపేక్షచేత నించుక తొలఁగి తరువులచాటుగా మేయుచుండెను.