పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

308

కాశీమజిలీకథలు - మూడవభాగము

ముద్దరించునని యయ్యోగి చెప్పిన విషయ మిమ్మాలతి యందు వర్తించుచున్నది. ఈ సాధ్వీతిలకము మీరెఱింగినదేకదా. ఈ కాంతారత్నమును ధర్మపత్నిగా నింతకు మునుపే మీరు స్వీకరించితిరి. కాని యది రహస్యకృత్వమైనది కావున నిప్పుడు వెండియుఁ బ్రఖ్యాతముగా నమ్మహోత్సవము జరిగింపవలయునని మాకు వేడుకగా నున్నది. అనుజ్ఞయిండని ప్రార్థించినఁ జిఱునగవు నవ్వుచుఁ జక్రవర్తి మంత్రిని జూచిన నతండును నట్టి ప్రార్థనయే కావించెను. ఇంతలో నావార్తవిని మందపాలమహారాజు కుటుంబసహితముగా నచ్చటికివచ్చి సంతోషసాగరమున మునుంగుచుఁ జక్రవర్తిగారిని సపరివారముగాఁ దనగ్రామమునకు రమ్మని ప్రార్థించెను. భూపాలదేవ మహారాజు దేవశర్మను నవకుబేరునితోఁగూడ శుభముహూర్తమునఁ దద్రాజ్యమున నిలచి యనంతరమున మందపాలుని పోలికింజని యందు మాలతిం బెండ్లి యాడి యాచేడియతోఁగూడ తన గ్రామమునకుఁబోయి విజయవర్ధనునితోఁ బెద్దకాలము రాజ్యము గావించెను.

విక్రమార్కుడును భట్టియు మాలతి వివాహానంతరమునఁ జక్రవర్తిగారి యనుజ్ఞ గైకొని యుజ్జయినికిం బోవుచు నొకనాఁడిందు నివసించిరి. అప్పుడీతటాక ప్రాంతమున మార్గస్తులు విశ్రమింప నీమంటపము గట్టింపుచు నొక పుణ్యాత్ముం డిందేవేని విగ్రహముల నిలుపవలయునని తలంపుతో విక్రమార్కుని కోరికొనిన నతండా పుణ్యాత్ముల విగ్రహముల నిందు స్థాపించి వీనిపై నిట్టి నామములు వ్రాయించి యఱిగెను నాటనుండియు నీవిగ్రహము లందున్నవి. జాత్యనుసారముగా ముఖమందు బాహ్మణునకు, భుజముల క్షత్రియునకును, దొడల వైశ్యునకును, బేరులు వ్రాయబడినవి. నీవు చూచిన విగ్రహముల వృత్తాంతమిది యని చెప్పి మణిసిద్దుండు శిష్యునితోఁగూడ తదనంతర నివాసప్రదేశమున కరిగెను.

క. అచలాత్మజా మనోహర | రుచిర శ్యామాంగ బహుళ రూపాక్షజగ
   న్నిచయ ప్రపాలనాతి | ప్రచురిత నిజసుప్రతవాభావా!

క. స్వస్తియగుఁ బ్రజలకెల్ల నీ | రస్తత మోహహృదయులగుచు రాజులుగోని
   ప్రస్తోమముల లరంగ శ| సాస్తజనులు సుఖమునొంద మహిఁబ్రోతురొగిన్ .

గద్య :- ఇది శ్రీ విశ్వనాధ సదనుకంపాసంపాదిత కవితావిచిత్రాత్రే

యముని సుత్రామిగోత్రపవిత్ర, మథిరకుల కలశజలనిధి రాకా

కుముదమిత్ర, లక్ష్మీనారాయణపౌత్ర, కొండయార్యపుత్ర,

సోమిదేవి గర్భశుక్తి ముక్తాఫల విబుధజనాభిరక్షిత సుబ్బన్న

దీక్షితకవి విరచితంబగు, కాశీయాత్రా చరిత్రమను

మహాప్రబంధమునందు తృతీయభాగము

సంపూర్ణము.

శ్రీ శ్రీ శ్రీ