పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నవకుబేరుని కథ

305

ఆయనమాటలయందు నాకప్పుడు కొంచెము విశ్వాసము గలిగినది కుటుంబమునంగల మమత్వదోషంబున లోభియై యాముష్మికము చెరుపుకొనగూడదు. తన గతి కడుపడువాడొక్కఁడును లేడని చెప్పిన యాయనమాటలు విని నేను అయ్యా! మీరట్లనిన నేమిచెప్పుదును నాసంతతి రెండువందల సంఖ్యకు మించియున్నది. వాండ్ర నందరను బోషించిన వూరకపోవునాయని యడిగితిని. అప్పుడతఁడు మోహమనునది ఇదియే వీండ్రలో నీసుకృత దుష్కృతములు బంచుకొనువా డొక్కడును లేడు అది యట్లుండె నైహికసుఖమున కైన బూనుకొనువాడులేడు. చుట్టాలు దొంగలు, ఎంత దనుక సంపాదించి పెట్టుచుందువో యంతదనుక నీకీస్నేహములు గలిగియుందురు. అది యుడిగినపిమ్మట జీవచ్చవముగా జూతురు దీనికి నీకు దృష్టాంతము చూపెదను. ఇట్లుచేయుమని చెవిలో నెద్దియో చెప్పెను. అందులకు నేనును సమ్మతించి యతనిం బంపితిని. పిమ్మట కొంతకాలము కపటరోగ మభినయించుచు గడపితిని.

ఒకనాటిరాత్రి భోజనము చేసినపిమ్మట నేను నాభార్యం బిలిచి నాకు తలనొప్పి వచ్చినది. మేనంతయు వివశముగా నున్నది. జీవము నిలుచునట్లు కనంబడలేదు. నేను జేయవలసిన పనులన్నియుం జేసితిని కాని మిమ్ముల నమ్మి యాముష్మికము విషయమై యించుకయు బనిచేయనైతి నింకొక సంవత్సరము జీవించితినేని యాకొరంత తీర్చుకొందును గదా యని పలుకుచు గన్నులుమూసి దుప్పటము ముసింగిడుకొని చచ్చెడివానివలె యట్టె పరుండితిని అప్పుడు నాబంధువులందరు హాహాకారనాదములు గావింపుచు నన్ను జుట్టుకొని యేడువదొడంగిరి. మఱి కొందరు మాంత్రికులం దీపికొనివచ్చి తెల్లవారువరకు జికిత్సలు చేయింపుచుండిరి. దేనివలనను నాకు స్వస్థతపడునట్లు తోచనందున వైద్యులీరోగము కుదురునది కాదనిచెప్పి వదలివేసిరి. ఊపిరి బిగపట్టి యట్లుండనట్టియోగ మయ్యోగియే నాకుపదేశించెను.

నేను జీవింపనని తోచి నప్పుడు నాభార్య నూతిలోబడ ప్రయత్నించినఁ బదుగురుపట్టుకొని కూర్చుండబెట్టిరి. పెక్కు లేల నాయందు భక్తివిశ్వాసములుగలవారందరు నేమిహత్యలు గావించుకొందురోయని తలయొకరిం గాచికొనుచునాప్తులు విరక్తి మాటలం జెప్పుచుండిరి. అట్టిసమయమున నయ్యోగి శర్కరామిళితము లయిన దుగ్ధములనొక పాత్రతో దీసికొనివచ్చి నామంచముదాపున నిలిచి దుఃఖించు వారినందరకు హస్తసంజ్ఞచే వారించుచు నిట్లనియె.

ఈతండు పూర్వకర్మఫలంబున నిప్పుడు కాలధర్మమునొందెను. ఇతనిగురించి చింతించిన బ్రయోజన యేమియులేదు మానుషచికిత్స లేమియు నితని జీవితము నిలుపజాలవు. ఈతనితో మీకెక్కుడు కార్యము గలిగియుండినం చెప్పుడు. ఈ సిద్దౌషధప్రయోగంబున నితని బ్రతికింతునని పలికినతోడనే నా భార్యాపుత్రు లతనిపాదంబులబడి మహాత్మా! రక్షింపుము రక్షింపుము. నీకేమి కావలయునో యిత్తుము ఇతనితోడిదే మాజీవనము! మా సిరియంతయు నిచ్చియైన నితని బ్రతికించుకొనుటయే మా కావశ్యకమయినపని యని ప్రార్థించిన నయ్యోగి యిట్లనియె.