పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

బ్రహ్మశ్రీ పండిత మధిర సుబ్బన్న దీక్షిత కవిగారిచే రచింపబడిన కాశీమజిలీ కథలు చదివి యానందించితిని. మృదుమధుర శైలిగలిగి నీతిబోధకములగు పద్యములతో నొప్పుచు బండితపామరజన మనోహరమై తగు నీ కథల విషయమై యభిప్రాయమీయ మే మనర్హులమయ్యు దత్కథాపఠన సంజాత హర్షాతిశయమే యిట్లు వ్రాయుటకుఁ బోత్సాహపరచినది.

ఈ కథలు ప్రారంభించిన తరువాత నెంత పనిలోనున్నను చివరవరకు చదివినంగాని విడువకపోవుటయే యిందలి రసాధిక్యము ప్రఖ్యాతమగు చున్నది. ఇందులకు లోకమే ప్రమాణము. వీని కథలని సామాన్యముగాఁ దలంపరాదు. శంకరాచార్యాది మహాపురుషుల చరిత్రములిందు వర్ణింపబడుటచే నిదియొక పురాణాగాథాకోశమని చెప్పుట సమంజసము. ఈ కథ లాంధ్రయోషకు నూత్నభూషావిశేషములై యొప్పుచున్నవని రూఢిగా చెప్పుచున్నాను.

ఇట్లు,

కావ్యనిధి శ్రీ చెలికాని లచ్చారావు


“కధావినోదమేయని మహర్షులు దాని జతుష్షష్టి విద్యలలో బరిగణించి యనుశాసించి అభివృద్ధి పరచిరి. ఇట్టి కథావినోదము వినోదమాత్ర ఫలజనకముగాఁ ధర్మాదిసాధనోపాయ మహత్తరంబగుట సర్వజనవేద్యమే.

కాశీమజిలీకథా నిబంధనము సర్వజన చిత్తాకర్షకంబనుటకును సందియము లేదు. దీనిలో రసాభావ పుష్టియు గథాసంధాన కౌశల మట్లుండ జతుర్విధ పురుషార్ధతంబులగు మహాకవి వాఙ్మయములోని నవరత్నములు సాధారణ కథా కథనధోరణిలో వెదజల్లబడి యుండుటచే నివి పండితులకును, గావ్యకర్తలకును గూడ బ్రతిభోన్వేషణ క్షమంబులని నిస్సంశయముగాఁ జెప్పవచ్చును. ఇందు బారమార్ధికులకు దప్ప సామాన్యులకు రుచింపని శంకరాచార్య చరిత్రము లతిరవంతములుగా బరమార్ధబోధకంబులుగ కథాధోరణిగా గూర్పబడినవి."

విశ్రాంతి చింతావినోదులకు జన్మజీవన తరుణోపాయంబగు తీయనియౌషధంబువలె నుండు నీ గ్రంథరాజమెంత పెద్దదిగానున్నను విసుగులేక యుత్తరోత్తరసంపుటముల కెల్లరును వేచియుందురని నిశ్శంసయముగా జెప్పవచ్చును.

ఇట్లు,

మానవల్లి రామకృష్ణకవి M.A.