పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

302

కాశీమజిలీకథలు - మూడవభాగము

వురు నాకు తోడుపడిరి మేము మువ్వురము నొక వీటిలో దేవాలయములో నుండగా నొకనాటిరాత్రి యెవ్వరో యొకచిన్నదానిని నాచెంతకు దీసికొనివచ్చి నన్ను లేపి కూర్చుండబెట్టి వివాహము గావించిరి. వారెట్లుచెప్పిన నట్లు చేసితినని తరువాత నాటివరకు తానుగావించిన కృత్యములన్నియుం జెప్పెను.

ఆచక్రవర్తి చరిత్రమువిని విక్రమార్కుడు మిక్కిలి వింతపడుచు నాచెంత నున్న యిరువుర యున్మత్తులంగాంచి అయ్యా, మీవృత్తాంతము సయితము శ్రోత్రానందనముగా నుండకమానదు. చక్రవర్తిగారికి వినవలయునని యుత్సుకముగా నున్నది. ఎద్దియో కారణంబున నిట్లుండిరి. కాని మీరును మహానుభావులని తోచుచున్నది మీకథ యెఱింగింపుడని కోరిన ముందుగా దేవశర్మ తన యదంత మంతయు నెఱింగించి వారికి సంతసము గలుగజేసెను. పిమ్మట రెండవయతండు శిరంబున చేతులుమోడ్చి నమస్కరించుచుఁ దన వృత్తాంత మిట్లని చెప్పఁదొడఁగెను.

నవకుబేరుని కథ

అయ్యా! నాకాపురము కాంచీపట్టణము. నేను వైశ్యజాతివాడ. నన్ను నవకుబేరుడందురు. నేను వాణిజ్యముచేసి మితిలేని ధనము సంపాదించితిని. దానం జేసియే నాకిట్టిపేరు వచ్చినది కాలక్రమంబున నాకుఁ బదుగురుపుత్రులును, బదుగురు పుత్రికలును జనించిరి మిగుల వైభవముతో వారికందరకు వివాహములు గావించితిని కూతుండ్ర నల్లుండ్రతో నింటియొద్దనే యుంచుకొని వారికి వ్యవహారములు కల్పించుచుఁ బెక్కురీతుల ధనము వృద్ధిబొందఁ జేయుచుంటిని. నాకు ధనముతోడనే కుటుంబము సైతము వృద్ధినొందుచుండెను. పెక్కేల నాసంతతి యనతికాలములో దుర్యోధనసంతతి యంత యయ్యె, మిగులవైభవముతో మహారాజులను సయితము లక్ష్యముచేయక దానధర్మముల విషయమయి కాసయినం గర్చుపెట్టక యతిలుబ్దచిత్తుఁడనయి మహామోహముతోఁ గొంతకాలము గడపితిని.

సీ. కాశీగయా ప్రయాగములలోనగు పుణ్య
                  తీర్థంబులకునైనఁ దిరుగనైతి
    నర్చింపలేనైతి నఖిలలోకైకనా
                 యకుఁ బుండరీకాక్షునభవు నైన
    సలుపంగలేనై తి సద్బ్రాహ్మణుల కెల్ల
                దానాళిలొ నొక్కదానినైనఁ
    జపియింపలేనైతిఁ సన్మంత్రముల నైనఁ
               బూజింపలేనైతిఁ బుణ్యతముల
గీ. కొరతవడునంచు ద్రవ్యంబు కూర్చి
    తలఁపు లుదయింప ముల్లెలదాఁచి దాఁచి
    కాసువీసము బోనీక కాల మెల్ల
    నకటఁ గడపితి మీఁద నేమగుదురొక్కొ .