పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

300

కాశీమజిలీకథలు - మూడవభాగము

దినము ముచ్చటించుచుంటిని. కానియాయన మతి తిరిగినదికాదు, ఇట్లుండ నొకనాడు మావీటిదేవాలయములోనికి దపంబు మూర్తీభవించిన ట్లొప్పుచున్న మహాయోగియొకండు వచ్చెనను వార్త విని మావల్లభుడుల్లంబు మరలించుననుతలంపుతో నిచ్చగింపకున్నను బలాత్కారముగా వాదనెపము బన్ని యాయన నాయతియొద్దకు తీసికొనిపోయితిని.

రెండవశంకరునివలె నొప్పుచున్న యయ్యోగిపుంగవుం జూచి మాఱేడు నమస్కృతియయినం జేయక తిరస్కారభావముతో జూచుచు నా మొగముజూచి మందహాసము సేయ డెందమున దొట్రుపడుచు నేనమ్ముని యడుగుదమ్ములబడి మహాత్మా! సర్వసంగపరిత్యాగంబు సేసియు పామరుల నుద్దరింప దేశయాత్ర గావించెడు మీవంటి మహానుభావు లజ్ఞులు గావించుతప్పులు లెక్క సేయుదురా? ఎఱుగని మాయపరాధములు సైపుడు మా చక్రవర్తిగారికి దైవకార్యముకన్న బురుషకార్యమే ప్రధానమైనదని మనంబునం బట్టియున్నది. నేను సమాధానపెట్టి యప్పట్టు త్రిప్పలేకున్న వాడ. దేవరయనుగ్రహ లేశము గలిగియున్న దృటిలో నతని భావము మరలగలదని పెద్దతడవు బ్రార్థించితిని.

అప్పుడతం డెట్టకే కన్నులెత్తి రాజుంజూచుచు నీ పద్యమును చదివెను.

సీ. పై దలుల్ దుష్టచేష్టాదూషితస్వాంత
                 లుత్తమాంగన లోక ముద్థరించు
    నరయ దైవాయత్తమైయొప్పు కనమెల్ల
                 వసుధ నెవ్వరికి నెవ్వరును లేరు
    తలపోసిచూడ నంతయు మహాచిత్రంబు
                 సంసార మనియెడు సాగరమునఁ
    గల్లోలముల భాతిఁ గలుగు నిమ్నోన్నత
                గతులు లోకుల కర్మగతులఁ బట్టి
గీ. పూని నిట్టూర్పు విడుచుటకై న బురుషుఁ
    డస్వతంత్రుడు మది నిట్టు లరసి యెపుడు
    ప్రజలఁ బాలింపు మయ్య భూపాలదేవ !
    సౌర్వభౌమ! మహియశశ్శౌర్య థామ!

అని చదువుచు నామతము సిద్ధాంతము గావింప శాస్త్రదృష్టాంతము లెన్ని యేనిం చూపుచు బోధించెను కాని యిన్నరనాథుం డందులకు సమ్మతింపక తానన్నమాటయే యాడుచు నాయతిని సైతము మతిరహితునిగా దలంచెను.

మహాత్ముల ప్రభావ మంచిత్యముగదా మరునాడు ప్రాతఃకాలమున యథాప్రకారము నేను కోటలోనికి పోయి చూచిన చక్రవర్తి యెందునుఁ గనంబడలేదు. సాయంకాలమువరకు వెదకి కానక విసిగి యది యోగికి కావించిన యపరాధమువలన జరిగిన పరాభవమని నిశ్చయించి యయ్యోగీంద్రుం బ్రార్థింపఁబోయితిని కాని యీలోపలనే యయ్యోగి యేందేనిం బోయెను. కావున డెందంబున బలుచందంబులఁ