పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

298

కాశీమజిలీకథలు - మూడవభాగము

నిడి పుష్పమాలిక గంఠంబున వైచి తొండమున దదంగముల మూర్కొనుచున్నది. దానికి వాడు సంతసింపక దైవాయత్తము దైవాయత్తమని పలుకుచు నెవ్వరు చెప్పినను దానిపయి కెక్కకున్నాడు. అప్పుడు బలవర్ధనునికి నావార్త దెలియజేయనతఁడు వచ్చుచున్నాడు ఇంతవట్టు చూచి వచ్చితిని. దాని నీవు చూచితివా

శృంగార - చూచితిని. నీవుచెప్పినది సత్యమే. కాని యేలాగైన విజయవర్థనుడు వాని రాజుగా జేయుటకు సమ్మతింపడు. వెండియు నెద్దియో యేర్పాటుచేయును అప్పుడయినను మనకు రాజ్యమురాదా? ఇదుండనేల? అచ్చటికిబోయి యేమిజరుగునో చూతము రండని పలుకగా నందఱు నిష్క్రమించిరి.

వారిమాటలు విని విక్రమార్కుడు వెరగుపడుచు భట్టితో కూడ నచ్చోటికి బోయెను. ఇంతలో విజయవర్ధను డేనుగుమీద నచ్చటికి వచ్చి దూరమునందే దిగి యున్మత్తులతో దిరుగుచున్న యతని చరిత్ర మంతయును విని స్వాంతమున నేదియో వింత సంతసము జనియింప జేతులు జోడించి దైవాయత్తము నెదుర నిలువంబడి ఈ పద్యము జదివెను.

సీ. పైదలుల్ దుష్టచేష్టాదూషితస్వాంత
                 లుత్తమాంగన లోక ముద్దరించు
    నరయ దైవాయత్తమై యొప్పు జనమెల్ల
                వసుధ నెవ్వరికి నెవ్వరును లేరు
    తలపోసిచూడ నంతయు మహాచిత్రంబు
                సంసార మనియెడు సాగరమునఁ
    గల్లోలముల భాతిఁ గలుగు నిమ్నోన్నత
               గతురు లోకుల కర్మగతులఁబట్టి
గీ. పూని నిట్టూర్పు విడుచుటకైనఁ బురుషుఁ
    డస్వతంత్రుఁడు మది నిట్టు లరసి యెపుడు
    ప్రజలఁ బాలింపు మయ్య భూపాలదేవ
    సార్వభౌమ! మహాయశశ్శౌరంథామ!

అని చదువగా విని దైవాయత్తము నిద్రితుండు మేల్కొనిన భంగి తలఎత్తి చూచి విజయవర్ధనుడా యేమి? ఎన్నిదినములకు బొడగంటిని. మన ప్రజలందఱు సుఖులయి యున్నవారాయని యడిగిన నతండు దేవరలేని కొరంత యొక్కటియే ప్రజలసుఖమునకు నవరోధకముగా నున్నదని బలుకుచు నుత్కంఠముచే గంఠము స్తంభింప నెలుంగ రాక యొక్కింతసేపూరకొనియెను. అప్పుడు జనులందఱు తల యొకరీతిం దలంచుచుండిరి.

విక్రమార్కుడు భట్టితో మిత్రమా? ఈతండు భూపాలదేవచక్రవర్తి సుమీ! తెలిసికొంటివా ? ఆతండిట్లుండుటకు కారణమెద్దియో యుగ్రాహ్యమై ఉన్నది. మాలతి వరించినవా డీతండే యగు చూడుము. ఆదైవజ్ఞుడు దైవజ్ఞుడే అని ప్రశంసించుకొనియెను మాలతియు తక్కిననిరువురు నతనిచెంతకువచ్చి నిలువంబడిజూడదొడంగిరి.