పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

288

కాశీమజిలీకథలు - మూడవభాగము

నాకించుకయు జ్ఞాపకములేదు. పెండ్లికి విఘ్నము వచ్చినదికాబోలు. నన్ను వీరు ముగ్గురు దీసికొనివచ్చి విరాగపుమాటలు చెప్పుచున్నా రేమి దీనికెద్దియేని కారణముండకపోదని తలంచుచున్న సమయంబున గొందఱు రాజభటు లాయడవియంతయు వెదకికొనుచు నచ్చోటికి వచ్చి యచ్చిగురుబోణింగాంచి యత్యంత సంతోషముతో నిట్లనిరి.

రాజపుత్రీ! నీ విచ్చటి కెట్లువచ్చితివి. ఈ కొమ్మలసందున డాగియున్న వీండ్రెవ్వరు? మిమ్ముంగానక మీ తల్లిదండ్రులు మిక్కిలి పరితపించుచున్నారని అడిగిన వారితో మిమ్మని బహువనముతో మాటాడుచున్నారు. నేనుగాక మఱియొకరు గానంబడలేదాయేమి ? అనిపలికిన నక్కలికి కాకింకరు లిట్లనిరి.

అయ్యో నీ వెఱుగవుకాబోలు రాత్రి వివాహానంతరముస నిన్నును నీభర్తను గదిలోనికనిపి తలుపులు మూసిరిగదా. వేకువజామున దలుపులు తీసియుండుటజూచి నీసఖురాండ్రు తొందరపడుచు లోపలకుబోయి యందు మీయిరువురంగానక వేగము పోయి నీతల్లికిం జెప్పిరి. అమె పతితోవచ్చి మిమ్ముగానక పెక్కుగతుల బరితపించుచు నలుమూలలకు దూతలబుచ్చెను. మేమీ వటవృక్షము చోరులకు విహారదేశమని యెఱింగినవారమగుటచే నిచ్చటికి వచ్చితిమి. దైవవశంబున నీవిందు గనంబడితివి. నీభర్త యెందున్నవాడని చెప్పిన ముప్పిరికొను విస్మయముతో నప్పడంతి వారికిట్లనియె.

దూతలారా! మీమాటలు విపరీతముగా దోచుచున్న యవి నాకు వివాహ మెప్పు డయినది? గౌరీపూజ సేయకపూర్వమే యేమిటికో స్మృతి తప్పిపోయినది. నేను పతి మొగము చూచియే యెఱుంగను పతితో గదిలోనికి బోవుటెట్లు? అని చెప్పుచున్న సమయంబున నా వృత్తాంతము దెలిసి యక్కలికి తలిదండ్రు లచ్చోటికివచ్చి పుత్రికంజూచి కౌగిలించుకొనుచు పెద్దతడవుగారవించిన తరువాత దదాగమన వృత్తాంత మడుగుటయు వారి కవ్వారిజాక్షి యిట్లనియె.

నేను గౌరీపూజ జేయుటకయి గంపలో గూర్చుండినది యెరుంగుదును. పిమ్మట నేమిజరిగినదో నాకుందెలియదు. నేటి ఉదయంబున నాగంపతోకూడ నీవృక్ష కోటరమున నుండగా దెలివివచ్చినది. ఈ మువ్వురు నాప్రాంతమందుండుటచే నందుండి కదలలేక వీరిం జీరినవారు నన్నుదింపిరి పిమ్మట నేనువారిని మీరెవ్వరని యున్న నేమిటికిచ్చటికి దీసికొనివచ్చితిరని అడిగిననొకండంతా మహావిచిత్రమనియు నొకండు దైవాయత్తమనియు వేరొకం డెవ్వరి కెవ్వరును లేరనియు నుత్తరమిచ్చిరి. వారిమాటలు నాయవస్థ కనుకూలించి యున్నవని తలచుచున్నంతలో నీదూత లిచ్చోటికి వచ్చిరి. ఇదియే నేనెఱింగినకధ. వీరు చెప్పినమాటలచే నాకు మఱియొక విస్మయముకలిగినది. నాకు వివాహమైనట్లును పెనిమిటితో గదిలోనికి బోయినతరువాత వేకువజామున మేము గనంబడినట్లును మీరు చెప్పుచున్నారు. అది యెంతసత్యమో మీరే యాలోచించుకొనుడని పలికినది.