పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(35)

దేవశర్మ అను బ్రాహ్మణుని కథ

281

వచ్చియుండెను. అతనిని బిచ్చవానిగాదలంచి యన్నగరవాసులైన బాలకులు మూగికొని యెవ్వరికెవ్వరును లేనివాడని వెక్కిరింపుచుందురు.

అతండు తరచు విజనస్థలములయందు వసించుచు నెవ్వరేని తెచ్చియిచ్చిన యాహారపదార్థముల భుజించి యాకలి యడంచుకొనుచుండును. దేవశర్మయు దైవాయత్తము నాయూరుచేరిన రెండుదినములకే యాతని నొక దేవాలయములో గలిసికొనిరి. మువ్వురిచర్యలు నొకరీతిగా నుండుటచే జంటగా నాముగ్గురు నొక్క చోటనే వసించుచుందురు వారి సహవాస వరిచయములు చూచి యా పట్టణ ప్రజలు గుంపులు గుంపులుగాబోయి పల్కరించుచుండ నొకడు దైవాయత్తమనియు, నొకడంతా మహావిచిత్రమనియు నొకడెవ్వరి కెవ్వరును లేరనియు పల్కు చుండ నవివేకులు పిచ్చివాండ్రనియు, వివేకులు సుజ్ఞానులనియు తలంచుచుండిరి. వారెవ్వరితో నేమాటయు మాటాడక యొండొరులు సైతము పల్కరించుకొనక యొకడు వోయినట్టుగా తక్కిన యిరువురు బోవుచు జంట విడువక యొకచోటనే వసించుచుందురు.

మాలతి కథ

వారు మువ్వురు నొకనాఁడొక దేవాలయములో శయనించి యుండగా నర్థరాత్రంబున పదియారేడుల యీడుగల యొకచక్కని జేడియం దీసికొనివచ్చి యొక దంపతులు పురోహితునితోఁ గూడ నాగుడిలో నలుమూలలు వెదకి యొకచోటఁ బరుండియున్న దైవాయత్తమును లేపి కూర్చుండబెట్టి నమంత్రకముగా నతని శిరంబున జలంబులు ప్రోక్షించి పీటలపై నతనిపజ్జ నజ్జవరాలిం గూర్చుండబెట్టిరి.

పిమ్మట నాపురోహితుడు మెల్లగా పాణిగ్రహణ మంత్రంబులు జదువుచు నావధూవరుల నూత్నాంబరాభరణములచే నలంకరింప జేసి దైవాయత్తము చేతులు పట్టుకొని యా నారీరత్నము కంఠంబున మంగళసూత్రంబు గట్టించెను. తరువాత నా దంపతులు చెరియొకరిచేతను తలంబ్రాలు పోయించిరి.

అట్లు ప్రచ్ఛన్నవివాహముచేసి యా దంపతు లాదైవాయత్తమున కెన్ని యేని యాహారపదార్ధములిచ్చి యచ్చేడియం దీసికొని పురోహితునితోఁగూడ తెల్లవారకమున్ను తమ నెలవులకుఁ బోయిరి.

మఱునాడుదయమున నూతనవస్త్రాలంకార చందన భూషితుండై యున్న దైవాయత్తమును జూచి పౌరులు మిక్కిలి వెరగుపడజొచ్చిరి. దైవాయత్త మాదినంబున దమ్ముఁ గుడువ బిలిచిన బ్రాహ్మణునికి తన యొడలియున్న విలువగలతొడవులన్నియు నిచ్చివేసెను. మఱియు నద్దినంబున సాయంకాలమున దైవాయత్తము మనంబున నెద్దియో తలంపు బొడమినంత నయ్యూరు విడిచి యుత్తరాబిముఖుడై యెచ్చటికో పోదొడంగిన నతనితోడనే బయలువెడలి తక్కిన యిరువురు నడువఁ