పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవశర్మ అను బ్రాహ్మణుని కథ

279

స్త్రీ - తరువాత నేమియున్నది? ఇంటికిబోయి యేడ్చుచు మంచముపైపరుండి నిద్రబోయితిని. తెల్లవారకమునుపే మునింగిపోయినట్లు నామగడింటికివచ్చెను.

పురుషుడు - అంతవేగముగా రానేమి పని యున్నది? ఏమి చేసితివి? ఏమి చేసితివి?

స్త్రీ - మఱియేమియులేదు. ఆ వెఱ్రివెధవలకు నాదినమున మా యింటిలోవారము. అందుమూలమున వచ్చెను. లేకున్న నాలుగు దినములవరకు రాకపోవును.

పురుషుడు -- అదియు మనకు ముప్పైనదే పోనీ అమ్మవారి గుడిలోని కేమిటికి వచ్చితివికావు?

స్త్రీ -- రాకపోలేదు. వచ్చితిని. అచ్చటను ఆ దుర్మార్గులే యున్నారు పూర్వం వలెనే జరిగినది.

పురుషుడు - అయ్యో! యిదియేమిపాపము మన సాంకేతికముల గ్రహించలేదుకదా. వీళ్ళపని పట్టెదనుండు. తరువాత మూడవమాటు పాడుగోడలలోనికో?

స్త్రీ - నీతో జెప్పిన నవ్వెదవు నేనతిప్రయత్నము మీద నా మొండిగోడ యెక్కి క్రింది నేమియున్నదో చూడక తటాలున దుమికితిని ఆగోడ క్రిందనే అంతావిచిత్రంగాడు పరుండియుండెను. కావున నాకాలువానికాలిమీద బడినది. అప్పుడు దద్దరిల్లుచు లేచి అంతావిచిత్రమోయని యరచెను ఆయరపు విని దైవాయత్తంగా డవ్వలినుండి దైవాయత్తమో అని కేకవైచెను ఆ కేకలతో చుట్టుపట్లవాళ్ళులేచి అది యేమియోయని యచ్చటికివచ్చిరి ఆ సందడిలో దప్పించుకొని యింటిలో బడుటకు నాకు దుర్ఘటమైనది సంవత్సరమునుండి ప్రయత్నములు చేయగా మూడు సమయములు దొరికినవి. అవి మూడు నా మూడులు ముక్కలు చేసినారు. అప్పుడొక్క మాటైన నీజాడ గనంబడినది కాదేమి?

పురుషుడు - ఏమని చెప్పుదును. నేను మూడుసారులును నీవు వ్రాసిన వేళకే బయలుదేరితిని. కాని మొదటిమాటు పిల్లి, రెండవమాటు ఒంటి బ్రాహ్మణుడు. తరువాత తుమ్ము. ఈ యపశకునము లగుటయు వెనుకకు మరలుచు గొంతసేపుండి బయలుదేరగా నెవ్వడో యడ్డమువచ్చి మాట్లాడుట, పిలుచుట, ఈలాటి విఘ్నములు తటస్థించినవి ఇంతలో గాలము మిగిలిపోయినది నేను మూడుసారులు వచ్చితిని. కాని వేకువవేళ యగుటచే నేజాడయు గానబడక మరలిపోయితిని. ఇంతకు ఆనీచు లిద్దరే మససుఖము చెరిపిరి వారి తాళము రేపు పట్టెదను. చూడుము. వాళ్ళడ్డము రాకున్న నేను వచ్చువరకు నీపు నిల్చియుందువుగదా?

స్త్రీ --- ఇక దాచనేల? నేనే వారిపని పట్టవలయునని తలంచితిని. కాని సాగినదికాదు. నాకు వాళ్ళ పై మహాకోపము వచ్చినది.

పురుషుడు - కోపమువచ్చిన నేమిచేసితివి.

స్త్రీ -- మొన్న మాయింటిలో వాళ్ళకు వారము గనుక అన్నములో విషము కలిపి వడ్డించితిని.