పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

278

కాశీమజిలీకథలు - మూడవభాగము

వసియించువారు, శ్మశానవాటికలు దేవాలయములు చండికాలయములు తోపులు లోనగు తావులకుఁ బోయి రాత్రిబరుండువారు ఆ గ్రామములో వారినందఱు నున్మత్తులని తలంచిరి. దేవశర్మవృత్తాంతము దైవాయుత్తమునకు దైవాయత్తము వృత్తాంతము దేవశర్మకును దెలియదు. వారు జడభరతుడువలె నెవ్వరేపని చెప్పినను జేయుటయేకాని యిట్టట్టని చెప్పువారుకారు. ఏదిపెట్టినను భుజింతురు వారొకనాడు రాత్రి ఒకదేవాలయములో పరుండియుండగాఁ కొంచెము ప్రొద్దుపోయిన తరువాతను మబ్బుపట్టి -

సీ. వినవెఱ్ఱిఱంకు గుబ్బెతలతప్పులు దప్ప
              దాచుటకిది కన్నతల్లి యిల్లు
    కడుపు కక్కురితి పిల్పుడు గనుముదిలంజె
              వఱడులకిది పిన్న వయసుమందు
    గడికన్నగాండ్ర యక్కఱలకు నిలుచూచి
              పొరువుసొమ్మిడనిది పూట కాపు
    కలవర్తకులకన్ను గవలబాయనినిద్ర
             గదలింపనిది నిమ్మకాయపులుసు
గీ. ప్రభకు, బాపన కుముదినీ పత్రనేత్ర
    రంజనంబున కిది సిద్థాంజనంబు
    నా ఘనాఘన కాళిమోన్నతివహించి
    కటిక చీకటి జగమెల్ల గప్పికొనియె.

అట్లు జగంబంతయు నంధకారమయంబై మిన్ను మన్ను కానబడని సమయంబున నాకోవెల యావరణలోని కెవ్వరో యిరువురువచ్చి యిట్లు మాటలాడిరి.

పురుషుడు - కాంతా! నీవు చీటిలో వ్రాసినదంతయు బూటకమనుకొనియెదను మూడుసారులు నాకు సాంకేతములు చెప్పి వచ్చితివికావే. అంత ప్రీతి స్వాంతమునుండిన నేల రాకయుందువు.

స్త్రీ - ఆయ్యో! నేను పడిన పాటులు నీకేమియెఱుక మొదటిమాటు వాటముఁ జూచుకొని యా తోటలోని పాడుచావడిలోనికిఁబోయి తడిమికొనుచు నొకమూల బండియున్న యొకలింగని నీవనుకొని మెల్లగా లేపితిని. వాడు దైవాయత్తమని పలుకుచు లేచెను. అప్పుడు నేను భయపడుచు వేరొక మూలకుబోయి యడంగి యుండి వాడు తిరుగా నిద్రపోయిన తరువాత లేచి నలుమూలలు వెదకిన మఱియొక మూల మనుష్యునిజాడఁ దోచుటయు నాదాపునకుఁబోయి పిలిచిన నంతా విచిత్ర మనుచు వాడు లేచెను. అప్పుడు దైవాయత్తమనచు నంతా విచిత్రమనుచు వారు జపముచేయ మొదలుపెట్టిరి. అట్టిస్థితిలో నేనం దెట్లుందును.

పురుషుడు - అన్నా మంచి సమయము మిగిలిపోయెనే. అయ్యో! మనపాలిటి యమదూతలవలె నాపాపాత్ములెక్కడ ప్రోగుపడిరి. తరువాత?