పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవశర్మ అను బ్రాహ్మణుని కథ

275

యువతిం గాంచి యేవగించుకొనుచు నతండౌరా! ఇది యంతకన్న విచిత్రముగా నున్నదేయని వెరగుపడుచు నదిమొదలు నంతకన్న విచిత్రము అంతకన్న విచిత్రము అంతకన్న విచిత్రము అని పలుకఁజొచ్చెను.

పాపాత్ములుండిన గ్రామములలో నుండుటయు బాపమేయని దేవశర్మ అందు నిలువక యప్పుడే మఱియొక యూరుచేరి యారాత్రి యెవ్వరింటికిఁబోక యొక గుఱ్ఱముసాల కనంబడిన నందుపరుండెను. అతనికి రాత్రులయందు నిద్రలేదు. కావున కన్నులుమూయకయే లోకవిపరీతములు ద్యానించుచు నిరసించుచున్న సమయంబున నర్థరాత్రంబునం జీకటిలో మబ్బులో మెరయు మెరపుతీగవలె నాభరణ కాంతులచే దళ్కుమని మెరయుచుఁ బంచభక్ష్యపరమాన్నములు గయికొని యొక వాలుగంటి యాసాలలోనికి వచ్చెను. ఆ చిన్నదానింజూచి దేవశర్మ యోహో! నా కన్నులు బాపపుకన్నులుగాబోలు ఎంతమారుమూల బరుండినను నేదో పాపకృత్యము నాకన్నులంబడుచున్నది. ఈచిన్నదియు మునుపటివారి వంటిదేయని తోచుచున్నది. పుణ్యకార్య మొక్కటియుం గనంబడదు. కానిమ్ము ఏమిచేయుదునని తలంచుచున్న సమయంబున నియ్యంబుజాక్షి యందుఁ బరుండియున్న యశ్వరక్షకునొక్కని మెల్లగా పిలిచినది.

వాడు కన్నులు నులిపికొనుచు లేచి రౌద్రాకారముతో నోసీ భ్రష్టుముండా! ఇంత ప్రొద్దు పోగొట్టితివేమిఁ నేనాకలితోఁ గొట్టుకొనుచుంటినే! క్రమముగా నీబుద్ధి చెడిపోవుచున్నది. చక్క చేసెద చూడుమని పలుకుచు నలుకమెయిం జెయి బిగించి మూతిమీద నొకగ్రుద్దు గుద్దెను. ఆవ్రేటుతో నాబోటి నోటిపండ్లు రాలి నేలంబడినవి. ఆనాతి వాని నేరికొనుచు అయ్యో? ఇట్లు కోపము సేయుదువు? నేనేమి సేయుదును. పళ్ళన్నియు రాలంగొట్టితివి. రాజుతో నేమని బొంకుదును? నీకెన్నిసారులు చెప్పినం దెలియదు. రాజును నిద్రబుచ్చి రావలయునా ? నాచిత్త మెప్పుడు నీయందే యుండును అయిన నేమిచేయుదును? మగనాలినగుటచే నాలస్యమయినది. సందుచూచుకొని వచ్చితిని. భక్ష్యములన్నియుం బాఱఁజిమ్మితివి. మంచివి నీకొరకు దెచ్చితిని గుఱ్ఱపు లద్దెలో పడిపోయినవి చూచి తినుము. నీదెబ్బవలన నాకేమియుం గోపములేదు, కాని బోసినోటిమాటలకే వెరచుచున్న దాన. కానిమ్ము. ఎద్దియేని బొంకి యీ నేరము రాజుమీదనే మో పెదనులే! యని వాని బ్రతిమాలుకొని తాను తెచ్చిన పదార్దములన్నియు వానిచే దినిపించి వానితో భోగించి యాకులట యేగినది.

ఆచర్యలన్నియుఁ గన్ను లారచూచి దేవశర్మ ముక్కుపయి వ్రేలిడికొనుచు మఱునాడు ప్రాతఃకాలంబున వీధింబడి పోవుచుండ రాత్రి పట్టపురాజు భార్యతో సరసమాడుచు పరిహాసమునకయి యతికోమలమయిన యామె బుగ్గమీద వ్రేలితో నొక వ్రేటు వేసినంత నయ్యింతి దంతములన్నియు రాలిపోయినవి. అందులకు పుడమి రేఁడు మిక్కిలి చింతించుచున్నాడు. ఆ దంతము లతికినవారికి మంచికానుక లిత్తురోయని చాటింపుచుండిరి.