పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

274

కాశీమజిలీకథలు - మూడవభాగము

రాత్రంబున గండదీపము నెత్తిమీద నుంచుకొని శ్మశానభూములలోనుండి చండికాలయమునకు బోయి తెల్లవారువరకు నందుండి రాగలదా?

ఇంకొకడు - ఆపిల్ల చాల మంచిదని నేనును వినియున్నాను. భూతోచ్ఛాటన శాంతికొరకే కాబోలు నీసంతర్పణచేయుట.

మొదటివాడు - అవును. రెండునెలలనుండి వెంకటావధానిగారి పుత్రికకు భూతబాధవలన నిద్రాహారములు లేవు. నేడు సంతోషముతో సంతర్పణ యెక్కుడుగా జేయుచున్నాడు . ఒక్క కూతురు గర్భాదానమయి యారునెలలు కాలేదు. అత్తవారింటికయిననుఁ బంపలేదు అట్టిస్థితిలో విచారించుట యబ్బురమా?

మఱియొకడు — ఆమాట యథార్థమగును కాని భుజింపుడు. మాటలానక యాడుకొనవచ్చును. అధిగో నేతిజారీ యిటు వచ్చుచున్నది పిలువుడు.

అని యిట్లు వారాడుకొను మాటలువిని దేవశర్మ యోహో! లోకమంతయు నావలెనే మోసపోవుచున్నదిగదా. యని వెరగుపడుచు నది మొదలు "ఎంతచిత్ర " మనుమాటమాని “ఎంతవిచిత్రము ఎంతవిచిత్రము" అని పలుకజొచ్చెను అతండా యూరిలో కొన్ని దినములుండి యందుండి వేఱొక గ్రామమునకుఁ బోయెను ఆ గ్రామమందొక పశువులశాలలో పరుండియుండగా నంతకుముందు వసించియున్న యిరువురమాటలు వినుటచే నతనికి దెలిసిన విషయమేమనగా -

ఒక దంపతులు స్వదేశమున కరవు పుట్టిన నెక్కడికేనింబోవుచు నొకనాడరణ్యములో నొకచెట్టుక్రింద బసచేసిరట. అంతకుబూర్వమే యాచెట్టు క్రింద కొందఱు బాటసారులు వసియించియుండిరి. ఆ మిథునములో మగవాడు భోజ్యపదార్థముల గూర్చుట కందందు దిరుగుచుండ నతనిభార్య యాబాటసారులలోఁ గాళ్ళుజేతులు లేని యొక యధముని వరించి తన యభిప్రాయము వాని కెఱింగించినదట. ఇంతలో మగడు వచ్చుటయు నెవ్వరును లేనిసమయములో నతని నీరు దెమ్మని యొక నూతి యొద్దకనిపి యతడు నీరుచేదుచుండ వెనువెనుకంజని యతని నూతిలోఁ బడవేసి యావంగుని భుజములమీద నెక్కించుకొని మోచుచు గ్రామములోనికివచ్చి యతండు తనమగండని చెప్పినంజూచి ప్రజలు తదీయ పాతివ్రత్య గౌరవంబునకు మెచ్చుకొనుచు రూకలును గోకలును నిచ్చుచు సత్కరింపుచుండిరి.

ఇట్లుండ నూతిలోఁ బడినవానిని మార్గస్థులు జలముకయి యరిగి పయికిఁ దీసిన నతఁడు భార్యను వెదకికొనుచు దేశాటనము చేయుచు నొకచోట కుంటివానిని మోయుచున్న భార్యను జూచి పల్కరించిన నాబొంకరి యతండే తన కాలుచేతులు నరకినవాడని చెప్పి నమ్మించి రాజుచేత మొదటిమగని శిక్షింపజేసినదట.

ఆవృత్తాంతమే వేడుకగా పాకలోఁబరుండి వాండ్రు చెప్పుకొనుచుండ విని దేవశర్మ యుదయకాలంబున లేచి కాలుచేతులనుండి పురుగులు గారుచుండ గుష్ఠురోగపీడితుండయియున్న కుంటివాని భుజములపయి నెక్కించుకొని యసహ్యమించు కంతయులేక సంతోషముతో మాటలాడుకొనుచు నెక్కడికో పోవుచున్న యాకపట