పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హేమ కథ

267

ఎవ్వరేమన్నను వారిజాడ యెక్కడనులేదు. రాజు పెద్దవాడయియున్నవాడు. భానుండనువానికే రాజ్యమిచ్చునని చెప్పుకొనుచున్నారు. ఎవ్వరికిని గాలము సమముగా నుండదుగదా? తత్పుత్రశోకము మాఱేని యుత్సాహము నడంగద్రొక్కినదని యచ్చటవార్త యంతయుం జెప్పెను.

అప్పుడు వారు క్రూరుల చేష్టలం గుఱించి వెరగుపడుచు దుర్జనుల శిక్షింపక పోవుటయు దుష్కృతమేయని తలంచుచు నప్పుడు తమనెలవునకుఁబోయి యమ్మరునాడు తమ రాకనంతయు బత్రికయందు వ్రాసి తండ్రి కనిపిరి. ఆపత్రిక చూచుకొని యారాజు సంతోషార్ణవంబున మునుంగుచు మేళతాళములతో నెదురేగి వారిని దోడ్కొనివచ్చి కోటలో ప్రవేశపెట్టి యాపూర్వకౌతుకముతో వారిమాట లాలింపుచు నాదినమున గడిపెను. వారితల్లులు ప్రాణావశిష్టులయి వారింజూచిన తోడనే చంద్రాగమనంబున సముద్రవీచికలవలె పొంగిరి.

అమ్మఱునాడొక సభజేయించి యారాజపుత్రు లిరువురు మంత్రిసామంత విద్వాంస పౌరవార మండితమయిన యాసభయందు దమ వృత్తాంతమంతయు నుపన్యాసముగా చెప్పి తమకు సోదరులు సేసిన ద్రోహకృత్యములన్నియు వక్కాణించిరి. ఆవృత్తాంతమువిని యందున్నవారెల్ల నారాజు మధ్యమపుత్రుల నిందించుచు వారిం గొనియాడదొడంగిరి.

వీరప్రతాపుడప్పుడే తనరాజ్యమంతయు పెద్దపుత్రుని యధీనము గావించెను. కావున విజయుడు రాజుయి దండ్యులయినవారిని విడచుట తప్పనియెంచి యా దుర్మార్గుల నిరువురను కోటముంగలనున్న స్తంభంబులంగట్టి వారమున కొకసారి పండ్రెండేసిదెబ్బలం గొట్టునట్లును వారితో గూడ రుచిరను మొగముమీద నుమియునట్లు నీరీతి సంవత్సరమువరకు చేయవలయుని శిక్షవిధించెను. వారియనంతరముగూడ నాకోట ముంగల వారి విగ్రహముల నినుపస్తంభములకుగట్టి సంవత్సరమునకొకసారి యట్లు చేయుచుందురు. ఈనగరమే యాసింధుభాయిది. చిరకాలమైసను నప్పటివారి సంతతివారు సేయించుచుండిరి.

ఇదియే వీనివృత్తాంతమని మణిసిద్దుడు చెప్పినవిని యా గోపకుమారుండు మిగుల సంతసించెను,

ఇరువది యెనిమిదవ మజిలీ

ఇరువది యెనిమిదవ నివాసదేశమం దొకతటాకముదాపుననున్న మంటపములో మూడు శిలావిగ్రహములున్నవి. వానిలో నొకదాని ముఖముమీద అంతా మహావిచిత్రమనియు, రెండవదాని భుజములమీద దైవయత్నమనియు మూడవదాని యొడలమీద నెవ్వరి కెవ్వరును లేరనియు పేరులు చెక్కంబడియున్నవి. ఆ పురుష విగ్రహముల కెదురుగా నొక స్త్రీవిగ్రహ మభిముఖముగా నున్నది. దాని భుజముల యందు విరాగిణియని వ్రాయబడియున్నది. ఆ వ్రాతలన్నియుం చదువుకొని