పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హేమ కథ

263

అంత పదియవమాసంబున నీశిశు వుదయించెను. ఏ కొదవయు రాకుండ నాకా బ్రాహ్మణుడు పురుడుపోసి వీనికి జాతకకర్మ నామకర్మాదులు యుక్తకాలంబునం కావించెసు. ఆయగ్రహార మరణ్యమధ్యమున నుండుటచే నీపాపని కైదేడులు వచ్చినప్పుడు వీడు పిల్లలతో నాడుకొనుచుండగా నరణ్యగజ మొకటివచ్చి జనులం బాఱదోలుచు వీథిలో నాడుకొనుచున్న నాముద్దులపట్టి నెత్తుకుని యడవిలోనికిం బోయెను.

ఆవార్తవిని నేను గుండెలు బాదుకొనుచు నెవ్వరు చెప్పినను వినక వీథింబడి యాయేనుగు పోయిన జాడం బో దొడంకితిని. పాప మా బ్రాహ్మణుండు నాతోగూడ వచ్చెను కొంతసేపు తిరిగితిమి. ఎందును మాతంగము గనబడలేదు. అప్పుడు నేను బలవన్మరణము నొంద నిశ్చయించి యాపాఱుని నింటికిం బొమ్మంటిని కాని అతడు నా యుద్యమం బెఱింగి నీకుమారునికి భయములేదనియు గొప్పరాష్ట్రాధి పతియగునని వెండియు బతితో సమాగమము గలుగుననియు లగ్నముగట్టి చూచితిననియు లోనగుమాటలచే నన్ను మృతినొందనీయక బలాత్కారముగా నింటికిం దీసికొని పొయెను.

నేను బుత్రశోకార్తినై నిద్రాహారములులేక కృశించి దిన మొక యుగముగాఁ బదిదినములు గడపినంతఁ బదునొకండవ దివసంబునఁ గొందఱు రాజభటులునేనున్న యగ్రహారమునకు వచ్చి యేనుగు ఎత్తుకొనిపోయిన పిల్లవానిని గన్నతల్లి యెందున్నదని యడుగుచు నా యొద్దకు వచ్చిరి.

వారింజూచి నే నేడ్చుచు దండ్రులారా! యీ పాపాత్మురాలి యవసరము మీ కేలవచ్చినది. నాముద్దులపట్టిం బట్టిన క్రూరగజము మీకు జిక్కలేదు గదా యని యడిగిన అమ్మా! నీవు చింతింపకుము నీపుత్రుడు కుశలియై యున్నవాడు. నిన్ను జూడ దొందరపడుచున్న వాడని చెప్పిరి.

ఆమాటలు చెవిని సోకినంత మేనుప్పొంగ నేమీ? మీరన్నమాట సత్యమే? ఎందున్నవాడు ఎట్లాగజము విడిచినది? నిజము చెప్పుడు. మీపాదములకు మ్రొక్కెదనని యత్యాతురముగ నడిగిన వారిట్లనిరి.

అమ్మా! మా రాజుగారికి వేటయందు మిక్కిలి పాటవముగలదు. తరచు వేటాడుచుందురు. మొన్న నీయడవికి వేటకువచ్చిరి. అప్పుడొక యేనుగు తొండముతో నీ గుమారునిజుట్టి పోవుచుండ గుంభమునం బెట్టుకొని నట్టడవిలో సంచరింపుచుండ నాభూపాలుండు చూచి, సవ్యసాచియుంబోలె గోదండంబుసాచి నైపుణ్యంబు మీరవాడి తూపులచే నక్కరిం బరిమార్చి యబ్బాలుని గాపాడి యెత్తుకొని ముద్దిడుకొనుచు అప్పా! నీ వెవ్వరివాడవు నీతల్లి పేరేమియని యడిగిన నబ్బాలు డూరక యేడ్చుచు అమ్మ, తాతయని చెప్పి యచ్చట నున్నారని యీ పల్లెదెస జేయిజూపువాడు అప్పుడు మారాజు మమ్ము జూచి యీ యరణ్యప్రాంతమందలి గ్రామములకుం బోయి యీ పుత్రుని వార్తం జెప్పి వీని తల్లిని దండ్రిని మన గ్రామము దీసికొనిరండు. పొండని పనిచిన వెదకికొనుచు నిచ్చటికి వచ్చితిమి. కావున నిన్ను దీసి