పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

262

కాశీమజిలీకథలు - మూడవభాగము

బాలించుచున్నది. తండ్రి స్వర్గస్థుడైనంత నతనికి పుత్రసంతానము లేమింజేసి యీమె యాధీనమైనది ఆమెపేరు హేమ. పతిపేరు విజయుడు. ఆయన యెందున్నవాఁడో తెలియదు. ఇందాక సభకు వచ్చిన చిన్నవాఁ డాయువతీరత్నము పుత్రుడు, సుగుణంబుల నామె నరుంధతి యని చెప్పనోపు. పవిత్రచరిత్ర యని మిక్కిలి స్తోత్రము చేయుచు వారిం దోడ్కొనిపోయి యంతఃపురమున విడిచిరి.

గజదత్తుడు వారి కెదురువచ్చి తీసికొని రత్నపీఠములం గూర్చుండబెట్టెను. అప్పుడు హేమ కాండపటములోనుండి వారింజూచి విజయుని గురుతుపట్టి సంతోషదుఃఖములు పట్టజాలక యట్టె తెర తొలగించుకొనివచ్చి యతని పాదంబులం బడి హాప్రాణనాథా జీవించి కుశలముగా వచ్చితిరా యని పలుకుచు శోకింప దొడంగినది.

అప్పుడు విజయుడు సంతోషముతో నాకాంతారత్నమును గ్రుచ్చియెత్తి యూరడించుచు పెద్దతడవు వివశుండై కుమారుని కౌగిలించుకొని తత్కాలోచితము లయిన మాటలచే కొంతసేపు గడపి పిమ్మట నాకొమ్మ కిట్లనియె.

కాంతా! నీవు న న్నేమిటికి విడిచివచ్చితివి? ఎందెందు సంచరించితివి? నీ వృత్తాంతము చెప్పుమని యడిగిన నమ్మగువ కన్నీరు దుడిచికొనుచు ననురాగసాంత్రములగు చూపు లతనిపై బరగించుచు నిట్లనియె

హేమ కథ

నాథా! మనము చెట్టుక్రింద నిదురించుచుండ మీసోదరుడు కృపాణము మీ మెడమీదవైచి నన్ను లేపి బలాత్కారము చేసిన నేనిదుర పరాకున నేమియుం తెలియక కొంతసేపు తొట్రువడుచుండఁ దానే మిమ్ము వధించినట్లు చూపిన నేను శోకముచే మూర్చపోయితిని అట్టిసమయమున నన్ను బలాత్కారముగా నొక మహారణ్యమునకుఁ దీసికొనిపోయెను. అందు నాకు కొంతసేపటికి తెలివివచ్చినఁ దనకు భార్య గమ్మని నిర్భంధించెను.

అందులకు నేను సమ్మతించితినికాదు. దానంగోపించి యా ప్రాంతమందొక నూయియుండ దానిలో నన్ను పడద్రోసి తానెచ్చటికో పోయెను.

ఇంతలో నొక బ్రాహ్మణుండు స్నానార్ధమై వచ్చి యందు నన్ను జూచి కనికరముతో పైకి దీసి యాప్రాంతమందున్న యగ్రహారములో నన్ను తనయింటికి తీసికొనిపోయి నావృత్తాంతమంతయు విని జాలి వొడమిన డెందముతోఁ గొన్నిదినములు దనయింట బెట్టుకొని కాపాడెను.

నే నప్పటికి నెలదప్పియుంటిని గనుక గర్భచిహ్నములు నాయందు చూచి యాభూదేవుడు కూతురువలె నన్ను చూచుచు నేను సంతతము మీకొరకు చింతించు చుండ నుదుట గరపుచు బరమానురాగంబున నన్ను బెనిచెను.