పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాముని కథ

261

శుండై యొక్కింతసేపూరకుండి కంఠము డగ్గుత్తిక జెందఁ దెరపితెచ్చుకొని యానందాశ్రువుల నద్దికొనుచు కుమారా? మీతండ్రి యెందున్నవాడని యడిగిన నది నాకుఁదెలియదు మాతల్లి యెఱుంగునని యాబాలుం డుత్తరమిచ్చెను. అప్పుడు సంతోషము పట్టజాలక విజయుండు తమ్మునికావార్తా యంతయుం జెప్పిన నతడా బాలుని మఱియు దర్కించి యడిగినవాడు విజయుని కుమారుడగుట నిశ్చయించి పెద్దతడవు ముద్దిడుకొనుచు వత్సా! మీతండ్రిని మే మెఱుగుదుము అతనికి మాకును బాంధవ్యమే కలిగియున్నది. అందుమూలమున నిన్నింతగాఁ జూచుచున్నారము. ఈ వార్త మీతల్లి కెఱింగింపుమని చెప్పిన నా రాజకుమారుడు వల్లెయని యుల్లము రంజిల్ల వారి యనుమతి వడసి తల్లి యొద్దకు బోయెను.

ఆరాజపుత్రికయు పుత్రునెత్తుకొని ముద్దాడుచు నాయనా! సభావిశేషములేమి? ఆవైదేశికుడు విపంచిని మేలగించెనా? అని యడిగిన నాబాలుండు అమ్మా! ఆ సభ కిరువురు వచ్చిరి వారి యాకారములు చూడ గౌరవకుటుంబములోని వారలుగా దోచుచున్నది వారిలో నొకడు వీణను మేలగించి హాయిగా పాడెను చెప్పనేల? యట్టి సంగీతమెప్పుడును వినియుండలేదని సభ్యులు కొనియాడిరి అది యట్లుండె. వారిలో మఱియొకడు నన్నుఁ జీరి ముద్దుబెట్టుకొనుచు నీతండ్రిపే రెవ్వరనియు తల్లి ఎవ్వతె యనియు లోనగు మాటలడిగిన దండ్రి విజయుండని చెప్పితిని. ఆమాటలు విని కన్నీరు విడచుచు మీతండ్రి యిప్పు డెందున్నవాడని యడిగిన మాఅమ్మకేగాని నాకుఁ దెలియదని చెప్పితిని అది విని యూరక చింతించుచు రెండవవానితో నా వార్త చెప్పెను ఆయనయు నన్నెన్నో యడిగి ముద్దుపెట్టుకొనుచు, తమకు నాతండ్రితో బాంధవ్యమున్నట్లు చెప్పి నీతో చెప్పమనెను. వారెవ్వరే? నాకును వారినిజూడ వేడుక పుట్టినిదిసుమీ? ఒకసారి పిలిపించి చూచెదవా? వారికేమియు నక్కరలేదట ఆ వీణ యిచ్చినం జాలునట? నీవు వారిఁ జూడగూడదా యేమియని యచ్చటిమాట లన్నియును జెప్పినవిని యప్పాటలగంధి దదీయరూపవిశేషంబు లడిగి తెలిసికొని పతి యనియు మఱింది యనియు నిశ్చయించినది.

పిమ్మట నౌత్సుక్యముతో వారిఁ దోడితేరఁ దగువారింబంపినవారుపోయి యా రాజపుత్రులంజూచి అయ్యలారా! మీ యదృష్టము మంచిది. మారాజపుత్రిక మీకు మంచి పారితోషిక మియ్యగలదు. మిమ్ములను నిలువంబడినట్లుగా నంతఃపురమున కే తీసికొనిరమ్మన్నది ఇంతకుముం దెవ్వరియందు నింతదయ జూపలేదని పలికిన విని విజయుం డిట్లనియె.

ఎన్ని సారులు చెప్పినను మీరు రాజపుత్రిక మాటయే చెప్పుచుందురు. ఈ దేశమునకు మగవాడు ప్రభువు లేడా యేమి? ఇచ్చటికి వచ్చినవారినెల్ల నంతఃపురమునకు రప్పించుకొనుచుండునాయేమి? మీ రాజపుత్రిక చారిత్రమెట్టిది? పేరేమి? పతి యెవ్వడని యడిగిన విని వారు అయ్యో మీ రెరుంగరా? ఇప్పు డామెయే దేశమును