పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

కాశీమజిలీకథలు - మూడవభాగము

హర్షము గలుఁగజేయుచుండెను. పతివ్రతలు పతుల కేది ప్రియమో అట్లే కావించి యానందింతురుగదా!

ప్రతిదినము ఆనాగరాజు జయభద్రుని రూపముతో వచ్చి రత్నభూషణములు కానుకలిచ్చుచు సునీతికి సంతుష్టి గలుగఁజేసి పోవుచుండ నాసాధ్వియు నతండు తనపతియే అని భయభక్తివినయవిశ్వాసములు దేటఁబడ నతని కుపచారములు చేయుచుఁ దద్దత్తమండనప్రదానమున లోకవిఖ్యాతకీర్తి సంపాదించుచుండెను.

నిజమైన జయభద్రుఁ డావార్తయేమియుఁ దెలియక వేశ్యాగృహమందే సంతతము నివసించి యుండెను.

ఒకనాఁ డిరువురు బ్రాహ్మణులు సునీతిచేమణిహారములు కానుకగానంది, యా వీధింబోవుచుండ వీధిగుమ్మమున నిలువంబడియున్న యనంగచంద్రిక నమస్కరించుచు అయ్యా! తమరికీ బహుమాన మెవ్వరిచ్చిరని అడుగగా వారిట్లనిరి.

కాంతా! వీని నెవ్వరిచ్చిరని యడుగవలయునా? మీయూరీలోఁ బ్రసిద్ధి జెందినవనిత యెవ్వతియో నీ వెఱుగవా? సునీతి విఖ్యాతి లోకవిదితమైనదే అమ్మహాత్మురాలి యీవికి సాటియున్నదా? ఆమె పెనిమిటి జయభద్రుఁడెంత ప్రయోజకుడో! నిత్యము తనయిల్లాలింత ద్రవ్యము దానముచేయుచుకడ నెట్లు సహించెనో కదా అని పెక్కుగతుల నాదంపతుల వినుతింపుచు నాబ్రాహ్మణు లెందేనిం బోయిరి.

ఆమాటలు వినినంత స్వాంతమున నీసుజనింప నాపడుపుచేడియ శిరఃకంపము చేయుచు నౌరా! వీరిమాటలు చోద్యముగానున్న యవి. జయభద్రుని భార్య సునీతి ఖ్యాతి యింతకుమున్ను నేను వినియున్నదాన జయభద్రుఁడు సంతతమునాయొద్దనే యున్నవాఁడు ఈతడు దానికెట్లు విత్తమిచ్చుచున్న వాఁడు! ఒకవేళ రహస్యముగా సొమ్మిచ్చి వచ్చుచున్నాడేమో! ఆరయవలయునని యూహించి ఒక దూతికకుఁ గొన్నివిషయములు బోధించి యామఱునాఁడు సునీతి యింటి కనిపినది.

ఆదూతిక యుదయములేచి వృద్ధబ్రాహ్మణిరూపము వైచికొని పెద్ద ముత్తైదువ వలె నొప్పుచు సునీతియింటికిఁ బోయెను సునీతి యాకపటకాంతంజూచి యాదరించుచు అవ్వా! మీదేయూరు? ఎచ్చటికిఁ బోవుచుంటివి! పతి ఎచ్చట నున్నవాఁడు ఇన్ని దినములు అయిదవతనము మోపిన నీపుణ్యము గొనియాడఁ దగి యున్నదని అడుఁగ నాటక్కులాడి యిట్లనియె.

అమ్మా! మాది కాశ్మీరదేశము. నామగండు చిన్నతనములోఁ గాశికిఁబోయి నేఁటివఱకును రాలేదు. ఆయన ఎచ్చటనున్నది తెలియదు అయినను వెదకుచు దేశాటనము చేయుచుంటివి. ఇప్పుడు రామేశ్వరములో నున్నవారని తెలిసి అచ్చటికి బోవుచుంటిని. మార్గములో నీవిఖ్యాతిని విని నిన్ను జూచుటకై వచ్చితిని. నీవుమిగుల బుణ్యాత్మురాలవు నీపతికిం నీయం దనురాగము గలిగియున్నదా? సంతానమోదం బనుభవింపుదువా? ఈయైశ్వర్యము పతి సంపాద్యమా? పితృ సాంపాద్యమా?