పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

252

కాశీమజిలీకథలు - మూడవభాగము

అప్పుడు వా డేమియు మాట్లాడక యారాత్రి రుచిరతో ప్రేయసీ! మా తమ్ముని యభిప్రాయము వింటివా? నీవు నాకు దగవట. మనమిరువురము ప్రీతిగా నుండుట వానికిష్టములేదు వాడొక యక్షకాంతను స్వాధీనముచేసికొని దానియొద్ద దాసిగానున్న దాని నాకు బెండ్లిచేయునట. ఎంతయుచితముగానున్నదో చూడుము. సవతితల్లి బిడ్డల కింతకన్న నెక్కుడు మైత్రియుండునా? కానిమ్ము నాకు వీనిపాటి తెలివితేటలు లేవనుకున్నాడు కాబోలునని చెప్పుచుండ నేనంతకుమున్ను వీథిలోనికి బోయి వచ్చుటచే నాకామాటలు వినబడినవి.

అంతలో నారాక తెలిసి యా ప్రస్తావన గట్టిపెట్టిరి. ఆతని దుర్వృత్తినరసి యా రాత్రి నేను పరుండెడుగదిలో మఱియొక పరిచారకుని బరుండబెట్టి వేఱొకచోట బండితిని. ఉదయకాలంబున బోయి చూచువరకు నా గదిలో బరుండియున్న పరిచారకుడు కత్తివేటు తిని చచ్చిపడియుండెను. అందు నావీణ గనంబడలేదు. అప్పుడు నేను మిక్కిలి తొందరపడుచు నలుమూలలు వెదకుచు రాముని గదిలోనికి బోయిచూడ నందెవ్వరునులేరు. వీణపోయినందులకు బరిచారకుడు చచ్చినందులకు మిక్కిలి దుఃఖించుచు నది రాముని ఘోరకృత్యముగా నిశ్చయించి కర్తవ్యము తెలియక పెద్ద తడవు శోకసాగరంబున మునింగితిని. నాకు నేన యుపశమించుకొని చారుమతీవియోగపరితాపాగ్ని హృదయమును దహింపజేయ నాపట్టణమెల్లను వెదకి యెందును వారి జాడ గానక విచారముతోనప్పురంవదలి అడవులు, పల్లెలు, పట్టణములు, గ్రామములు వెదకికొనుచు నిచ్చటికి వచ్చితిని. ఇందు దైవవశంబున నీవుగనంబడితివి ఇదియే నావృత్తాంతము మనమిరువురము సోదరులమూలమున భార్య లేనివారమైతిమి. భార్యలేనిజన్మ జన్మమే - ఆహా ! అట్టికాంత యీ జన్మంబున నాకు లభించునా ?

సీ. భార్యలేకయొనర్చు పండువుదండువు కులకాంతపెట్టనికూడు గీత
    బత్నితోఁబలుకని పలుకులు చిలుకులు గృహిణిలేని కబంధకేళిజాలి
    జాయవాటింపని సరసముల్ విరసముల్ప్రాణేశ్వరికిఁగాని పాటుచేటు
    దయితరై సేయని ప్రియములు భయమువలుల్ల భవెలియైనయిల్లుపొల్లు
గీ. ముద్దుకులకాంత సుద్దులే ప్రొద్దువినని
    చెవులు గవులు వృదావేయిఁ జెప్పనేల
    యకట! సతిలేని బ్రతుకేల యర్థమేల
    వాహనములేల కరులేల వసుధయేల.

అని విచారించుచున్న తమ్ముని నోదార్చుచు విజయుండు చంద్రా! దైవకృతంబులకు వగచుట పురుషకారణంబుకాదు. నీ వమానుషోచితములైన భోగంబు లనుభవించితివి. కానిమ్ము అదృష్టముండిన వెండియు లభింపకుండునా? తగు ప్రయత్నము చేయుదుము. ఆవీణ దొరకకున్న దిరుగనాశైలముల బోవుదము. అదియునుంగాక యక్షిణీగాంతలకు దివ్యదృష్టి కలిగియుండును. చారుమతి నీ వెక్కడ నున్నను వెదకికొని వచ్చును. ఏదియులేకున్న నేమిచేయగలమని యెన్నియో దృష్టాంతరములు