పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(31)

రాముని కథ

249

వముగల తస్కరులు విరళముగా నున్నారు. రెడ్డియను వాడొకడు దీనిలో గండడని వాడుక యున్నది. వానింబట్టుకొనవలయునని పెక్కుతెఱంగుల బ్రయత్నింపచున్నవాడ. వానిజాడ యేమియుఁ దెలియకున్నది. అని చౌర్యరహస్యవిశేషంబులన్నియు భార్య కెరింగింపుచుండెను.

అట్టిసమయమున నేనును రుచిరయు వారి మంచంక్రింద దూరి మెల్లగా నా మంచమెత్తి గదిలోనుండి యవ్వలికి దీసికొనిపోయి యందు దించి గదిలోనున్న వస్తువులు సంగ్రహించి యరుగనున్న సమయములో నందొకచో సవరింపబడి యున్న వీణెయొకటి నాకన్నులఁ బడినది. దానిజూచి నేనూరకొనలేక వెళ్ళిపోవు సమయములో వ్రేలితో నాపెట్టె మీట మ్రోగించితిని.

ఆనాదము వినినతోడనే విక్రమార్కుండు తటాలునలేచి తమప్రమాదమును తెలిసికొని బ్రవేశించి యాగదిలోనున్న రుచిరం బట్టుకొనియెను. నేను దొరకక వచ్చిన వివరములంబడి బడి పాఱిపోయి గోడలంఘించి కడువేగముగా నచ్చటికి వచ్చితిని. నా ప్రాణములన్నియు రుచిరమీదనే యున్నవి. వానింబట్టుకొని యారాజు నీవెవ్వతెవు? నీతోవచ్చినవాఁడెవ్వడు? నీ వృత్తాంతము చెప్పుము నిజము సెప్పిన నిన్ను విడిపింతునని యెంతయడిగినను మూగదానివలె మాటాడక వ్రేలితో నాకసమువంక జూపుచున్నదట. రాజసభలో దానినిఁ దర్జనభర్జనాదులచే రాజభటులు పరిభవింపక బ్రయత్నించిన స్త్రీయగుటచే నట్టిపని వలదని యతిదయాళుండై విక్రమార్కమహారాజు వారించెనట.

ప్రతిదినము విక్రమార్కుడు దాను సభజేయునప్పుడు రుచిరను నెదురుగా నిలువంబెట్టి నీవృత్తాంతము సెప్పవాయని యడుగుచుండ మొదటఁజూపిన వ్రేలే యాకసమువంకఁ జూపుచున్నదట. ఈ నౌరాంగనను మాటాడించిన వారికిని బారిపోయిన గజదొంగను బట్టి యిచ్చినవారికిని మంచి పారితోషిక మిప్పింతునని మొన్నటిదినం బారాజు చాటింపఁజేసెను.

ఈ సత్రములోనికి వచ్చి కొత్తువాలు క్రొత్తవారిని విచారించెను. కాని నా గౌరవాకారమునుబట్టి నన్నేమియు విమర్శింపలేదు తమ్ముడా! ఇదియే నావృత్తాంతము. ఇంతలో దైవములాగున నీవు వచ్చితివి నీకు తరువాత జెప్పెదను కాని నా ప్రాణనాయకి నెట్లయిన విడిపించుకొని వచ్చు నుపాయము చెప్పితివేని నేను బ్రతికెదను. లేకున్న నీవు చూచుచుండగనే ప్రాణములు విడిచెదను. ఆహా!

శా. ఆమోమందము నాకనుంగవ బెడం గామోవిసింగారమా
    గోముంజన్గవపొంకమా గొనబునిగ్గుల్ మీరు నూగారుసా
    రామించుందొడజగ్గు లానడల యొయ్యారంబు లయ్యారుయా
    భామారత్నము చూచి చూడవలెగా పద్మాక్షి నింకొక్కెతెన్.