పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

238

కాశీమజిలీకథలు - మూడవభాగము

మునుపటి వరిమళము గొట్టగా నేను మునుపటిమాటున దాగి యాదెస దృష్టినిడి కూర్చుంటిని.

అప్పుడప్పడతులు శృంగారగమనంబుల నయ్యావరణలోనికి వచ్చి పెచ్చుపెరుగు సంతసముతో చమత్కారవచనంబులు పలుకుకొనుచు మునువోలె నత్తటాకంబున జలకేళిందేలి యనంతర మమ్మహాలింగమును నిర్మాల్యవ్యత్యయము లేమిం జేసి మునుపొందిన సందియము నొందక పూజించిరి. పూజావసానమున వారిలో నీశ్వరు నర్చించిన చిన్నది కొందరు సఖులతో గదళీవనవిలోకనార్థ మరుగుటయు నప్పుడమ్మంటపమున గూర్చుండి యిరువురు తరుణులిట్లు సంభాషించుకొనుచుండిరి.

తమాలిక - మల్లికా! మన భర్తృదారిక భువనమోహనసుందరియై యనురూపభర్తృగామిని కాకుండుటచే సహకరసంపర్కంబు గాంచని మాధవీలతయు బోలె వెలితిపడియున్నది సుమా! యీపరువ మిట్లడవి వెన్నెలజేయుటకు గారణ మేమి?

మల్లిక -- ఇది గోప్యమయిన వృత్తాంతము. చారుమతివలన మొన్ననే నేనీ కథ వింటిని. నీవెఱుంగవు కాబోలు.

తమాలిక - అది నేనెఱుగను. మనకును గోప్యమున్నదియా? చెప్పుము చెప్పుము.

తమాలిక .... మొన్న సాయంకాలమున నేనును భర్తృదారికియగు చారుమతియు నలకాపుర బాహొద్వానవనంబున విహరింపుచు నలకూబరుండు రంభాసహితుండై విమానమెక్కి, యెక్కడికేని బోవుచుండ వీక్షించితిమి.

తమాలిక - అగు నతండెప్పుడును రంభను విడిచియుండడు తరువాత?

మల్లిక - వారింజూచి నేను ముచ్చటపడుచు బడతీ! నీకిలాటి మనోహరుండు లభించిన జక్కగానుండును సుమీ అని పలికితిని

తమాలిక - చారుమతి నామాటవిని యించుక సిగ్గభినయించుచు నలుమూలలు జూచి కన్నులు మూసుకొనుచు మందహాసముతో సుందరీ! నానివాహవృత్తాంతము నీ వెఱుంగవు కాబోలు గౌరీనాథుని యనుగ్రహమువలన నింతకన్న చక్కనివాడే దొరకకూడదా? అని పలికినది

తమాలిక - మంచిమాట చెప్పినది. తరువాత ?

మల్లిక ఆమాటవిని నేను సఖి! నీకెప్పుడు పెండ్లియగునని గంపెడాశతో నుంటిమిగదా! క్రొత్తవిశేషములు వినినప్పుడు మాకు జెప్పుకున్నది యుచితమే? యని పలికితిని.

తమాలిక – మనయొద్ద గోప్యము చేయునా? సిగ్గుచే చెప్పలేదనుకొనియెదను పిమ్మట నేమన్నది?

మల్లిక - ఆమాటయే సూచించుచు నిట్లని చెప్పినది నలకూబరుడు నన్ను వరించి దూతిముఖముగా మాతండ్రికి దెలియంజేసిన నతడు మాతల్లితో వితర్కించి