పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

232

కాశీమజిలీకథలు - మూడవభాగము

నర్చించుచు నిందు ముక్తిం బడసెదను. మహాత్ము లెవ్వరో యిందు గ్రుమ్మఱుచున్నవా రని తలంచుచు హర్షపులకితగాత్రుఁడనై యచ్చటి విశేషంబులం జూడ నందందు విహరింప దొడంగితిని.

వేఱొకమూల మఱియొక ద్వారము గనంబడినది. దానింజూచి దెలిసినది. ఎవరో యీ మార్గమునవచ్చి యీ లింగమును బూజించుచున్నారు కానిమ్ము. వారి వృత్తాంతము తెలిసికొని వచ్చెద జూచిరి. నంతమాత్రముననే శపియింతురా? కఠిన హృదయులై యెవ్వరేని శపియించిన బడియెదగాక. పూర్వకృత్యములు తప్పునాయని యూహించి యా ద్వారమార్గంబున బడి యతిసాహసముతో గొంతదూరము పోయితిని.

అచ్చట గుడియెడమలకు రెండుద్వారము లున్నవి. దేనివలన బోవలయునని కొంతసేపు ధ్యానించి యెడమవైపుదారిం బోవలయునని తలంపు పుట్టినందున నట్లు పోవబోవ నాదారి యొక కొండశిఖరము మీదికి దీసికొని పోయినది. వెనుకకు దిరిగి చూడ నేను వచ్చిన గుహాముఖద్వారము గనంబడినదికాదు. అప్పుడు నేను మిక్కిలి పరితపించుచు అయ్యో! నేనా గుహాంతరమున నుండక యిట్లు రానేల? ఆ రెండవదారింబోయిన నుచితముగా నుండును. నా కిట్టిబుద్ధి యేమిటికి బుట్టవలయును ఇక నాజన్మమున కట్టి వింతలంజూచు భాగ్యముగలుగునా? ఆహా! ఆ కదళీవననివాససౌఖ్యంబు లెన్నిజన్మములకైన మఱువనగునా? అమ్మణిమంటపశోభ లెప్పుడో విమర్శించి చూచెదంగాక యని యపేక్షించితి ఏదియు లేకపోయెను.

నా కాయకష్టమంతయు నీయడవికైనది, ఇచ్చటినుండి యెక్కడికిబోవుదును. తెరువెద్దియుం గానంబడదు. సీ యిక నాకు జీవితముతో బనియేమి? ఇచ్చటనే పడి యుండెదను. ఏ క్రూరసత్వమో నన్ను భక్షించుగాక యని తలంచుచు నందొకచెట్టు క్రింద జతికిలంబడితిని.

అంతలో నా ప్రాంతమునుండి యొక యేనుగు కనకకలశంబు తొండమునం బట్టుకొని క్రిందికి బోవుచున్న యది. దానిజూచి నేను వెఱుగుపడుచు నిది యడవి యేనుగు కానియట్లది ధరించిన కలశంబు తప్పక చెప్పుచున్నది. ఇది యెవ్వరిదై యుండును? పెంపుడుదై నను నియంత యుండవలయును. ఇది జలానయనార్ద మగుచున్నట్లు తోచుచున్నయది. ఇది దేవభూమి కావున నమానుషప్రభావంబు లుండక మానవు. దీని పోయెడిరీతి నరసెదంగాక యని యించుక యెడముగా దానివెంట నడువ దొడంగితిని.

అది క్రమంబున నా కొండదిగి పాతాళగంగ యొడ్డునకుబోయెను. అందు గొంతదూరము పాతాళగంగలోనికి సోపానములు గట్టబడియుండెను. అమ్మాతంగము మెల్లగా నా పాతాళగంగలోనికిం దిగి యా కలశంబు నిండించుకొని తిరుగా వచ్చుచున్న సమయంబున నేనతి సాహసముతో నెదుర నిలువంబడితిని. అప్పుడది నన్ను జూచి బెదరక, అలుగక యట్టె నిలువంబడుటయు నాకు నేనుగుల నెక్కుపాటవము