పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చంద్రుని కథ

231

నాదంబులు వినంబడునేమో? అని తలంచుచుండ నాధ్వని మఱియు విపులమగుట నాబిలములోనుండి వచ్చుచున్నట్లు తెలిసికొంటిని.

అప్పుడు నాకు వెండియు జీవితాశ పొడమినది. చేతులు రెండును బైకిసాచి గుహకుడ్యనివరంబుల వ్రేళ్ళంజొనిపి జయపరమేశ్వరా! యని కాళ్ళచే నెగద్రోసితిని. ఆ త్రోపువలన బారెడు పైకి బోవ శక్యమైనది. అది భగవంతుని కటాక్షము వలన గలిగిన యవకాశమని సంతసించుచు నాపైన రెండుబారలు సులభముగా డేకితిని. పిమ్మట కొంచెము బిలము పెద్దదిగా గనంబడుటచే సులభముగా మఱికొంతదూరముపోవ శక్యమైనది. అంతకంత కాబిలము విశాలముగా నొప్పుచుండుటచే తుదకు నిలువంబడి కొంతదూరము నడిచితిని.

అప్పుడొక వెలుతురు నాకన్నులకు దారిజూపినది పిమ్మట జక్కగా నూపిరి విడచుచు నరకకుహరంబు దాటినట్లు సంతసించుచు నిం దేవేని విశేషము లుండక మానవని యా గాననాదంబు లేతెంచిన జాడ నరయంగోరి తదభిముఖముగా బోవుచుండ గొంతసేపటికి నానినాదము వినంబడినదికాదు. నేను వెఱగుపడుచు దైర్యమే తోడుగా గొంతదూరము వోయినంత విశాలమగు కదళీవనంబు గసంబడినది. అందెవ్వరునులేరు సూర్యబింబము గనంబడలేదు. అద్భుతమైన తేజంబొకటి పట్టపగలు లాగున దృష్టులకు సహాయము చేయుచుండెను. దానంజేసి యందు నిర్భయముగా విహరింప శక్యమయ్యెను. నాకు మిక్కిలి యాకలియగుచుండెను. పండియున్న కదళీఫలంబుల దృప్తిగ భక్షించి యందున్న తటాకజలంబులం గడుపునిండ జలంబుగ్రోలి యొక చెట్టుక్రిందం బండుకొని గుహాగమనాయాసము వాయ గొంతసేపు గాఢముగా నిద్రబోయితిని.

అంతలో లేచి యేమియుం దోచక యాకదళీవనంబంతయు దిరుగుచుండ నొకమూల మార్గంబొండు గనింబడినది. దానంబడి కొంతదూరము పోయితిని. అక్కడ వేఱొక యావరణము దానిలోని కొకద్వారమునుం గనంబడుటయు నిర్భయముగా నాద్వారమునుండి యా యావరణములో బ్రవేశింప నందున్న రత్నకాంతులు నా కన్నులకు మిఱుమిట్లు గొల్పినవి.

అప్పుడు నేను గన్నులమూసికొని కొంతసేపటికి మెల్లగా దెరచిచూడ విశాలమగు స్ఫటికశిలామంటపం బొండు కన్నులపండువ గావించెను. అందు బిల్వదళాళిచే నర్చింపబడిన స్ఫటికలింగం బొకటి విరాజిల్లుచున్నది. ఆ ప్రాంతమందు వీణయొకటి మేళగించియున్నది. మఱియు నందు బూజాపాత్రంబు లెన్నియేని యమరింపబడి యున్నవి ఆ మంటపమునకు తూర్పుభాగమున రత్నసోపానములచే మెఱయుచున్న తటాకంబొకటియున్నది. అట్టి విశేషములన్నియుంజూచి నేను నివ్వెరపడుచు నిది దేవభూమి కాబోలును, ఎవరో యీస్వామిని నర్చించిపోయిరి. ఇందాక నాకు వినిపించిన గాననాదం బీ వీణెవలనం బుట్టియుండవచ్చును. అమానుషంబులగు విశేషంబులం జూడంగంటి. నాజన్మమున కిదియే చాలును. నేనును నిమ్మహాలింగంబు