పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయుని కథ

223

వేగముగా నొకమార్గమున బడి పోయిపోయి కొన్నిదినములకు మఱియొకపట్టణము చేరెను.

అందు సత్రములో బసజేసి మార్గాయాసము వాయ రెండు మూడు దినము లుండెను రాత్రి సత్రమువీథి యరుగుపయిం బండుకొని చీకటిలో నాబోటి యతనితో నార్యా! మన మెన్నిదినము లిట్లు చిక్కులు పడవలయును. మన మెన్నటికైన సుఖపడుదుమా? అని ప్రస్తావముగా బలికినది అప్పుడతండు కాంతా! నీపు జింతింపకుము ఈ పట్టణపురాజు మిక్కిలి సరసుడట. రే పాయనం జూడబోయెదను. ఆయనదర్శన మయినంతనే నీ మేనంతయు బంగారమయము చేసి యేడంతరములు మేడపయిని హంసతూలికాతల్పంబున నిన్ను గూర్చుండబెట్టనా? చూడు నాప్రభావంబని యోదార్చెను.

అట్టి సమయంబున నా పట్టణపురాజు భీమవర్మయనువాడు మాఱువేషము వైచికొని పట్టణవిశేషముల దెలిసికొన గ్రుమ్మరుచు వారి మాటలు విని వెరంగుపడి వీడెవ్వడో మిక్కలి నేర్పరిలాగున దోచుచున్నాడు . నన్ను జూచినంతనే యెక్కుడు సిరిసంపాదించునట ఇది యదార్థమో డాంబికమో చూచెదంగాకయని యప్పటికింటికి బోయి మఱునాడుదయమున సభజేసి సత్రములో విదేశదంపతులు ప్రవేశించి ఉన్నవారు. అందు మగవానిని సగౌరముగా దీసికొనిరండని కింకరుల సంపెను.

వారు వెదకికొనుచుబోయి యవ్వార్త విజయునికి జెప్పిన ముప్పిరిగొను సంతసముతో నతండప్పుడే భార్యకుంజెప్పి గొప్పవేషముతో నాకింకరులవెంట రాజసభకు బోయెను. అతనిం జూచి యానృపతి యేమియు మాటాడక తనదాపుననున్న పీఠంబుపై గూర్చుండ సంజ్ఞమాత్రము చేసెను అతడా పీఠంబునం గూర్చుండి యెవ్వరితోడను మాటలాడక సభాభవనవిశేషములం జూచుచుండెను.

ఆ రాజు మధ్యాహ్నమువరకు సభచేసి పిమ్మట సింహాసనమునుండి లేచెను. సభవారందఱు నాయనతోడనే లేచిరి. విజయుడును నిలువబడియెను. అక్కడనే కొందఱు రాజుగారి సెలవు దీసికొని వెళ్ళిపోయిరి. రాజుగారు తనమేడలోనికి బోవునపుడు మొదటియంతరమున గొందఱు రెండవయంతరమున గొందఱు మూడవయంతరంబున గొందఱు సెలవు పుచ్చుకొనిరి మంత్రి నాలుగవయంతరమువఱకు బోయి యచట నిలువబడి రాజాజ్ఞ పుచ్చుకొనెను. విజయుడు మాత్రము విడువక ఆరవయంతరమువరకు బోయి యందు దేవా! అనుజ్ఞ యిత్తురేని బోయివత్తునని యడిగిన మంచిదని యా రాజు పలికి యేడవయంతరమునకు బోయెను మంత్రిసామంతాదిపరిజన మతనిపోక జూచి యోహో! యెవ్వరు నయిదంతరములకన్న బైకిబోవువారులేరు. ఈతడు రాజుగారి కెట్టియాప్తుడో యని యాలోచించుకొనుచు మొదటియంతరమున నిలువబడియున్న సమయంబున విజయుడు వడిపడి నామెట్ల అన్నింటిని దిగివచ్చి గంభీరస్వరముతో మంత్రి యెవ్వరని యడిగెను. ఆ మాటలకు మంత్రి జడియుచు నేను నేనని మెల్లంగా పలికెను. నీవేనా మంత్రివి. కానిమ్ము