పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

212

కాశీమజిలీకథలు - మూడవభాగము

సందియమేమి? అదిగో చూపుల చాతుర్యమతనిదే ఈమాటు తెలిసినదా? ఒడలు త్రిప్పుకొనుటవలన స్పష్టమైనది. ఆమాటల గాంభీర్య మింకొకరి కెట్లువచ్చును" అనుటయు బ్రియంవద తలయెత్తిచూచి "మదవతీ! నీమాట నిక్కువమే. అదిగో అవ్వలి ప్రక్కను సుభద్రుడు నడుచుచున్నాడు. నీవతని గుఱుతుపట్టలేదు కాబోలు నాగమణి యతనిని రామలింగకవియని చెప్పినదేమి? ప్రమాదముగా వినియుండవచ్చును. రామకవి యిచ్చటి కేమిటికై వచ్చెనో" యనిపలికిన మంగమణి పనియేలేదా? మనకొరకు రాగూడదా. అది యట్లుండె నాగమణి! నీవితని నెవ్వరిని వింటివని యడిగిన రామలింగకవి యని వింటినని చెప్పినది.

ఆమెయు మరలబోయి యతనిపేరు స్పష్టముగా దెలిసికొని రమ్మని దాని ననిపి ప్రియంవదా! నాకు మఱిరియొక యూహ పొడముచున్నయది అది నిక్కువమేని విస్మయమే. రామలింగకవియే రామకవియని చెప్పిమరల మోసపుచ్చెనని తలంచుచున్నదాన గానిచో నితరుల కాబుద్దిసూక్ష్మత యెక్కడిది వితర్కింప నాకిప్పటికి నిశ్చయమని తెల్లమైన"దని యా విషయము ముచ్చటింపుచున్న సమయంబున నాగమణివచ్చి యిట్లనియె.

పుత్రికలారా! నేనతండు రామలింగకవియేయని స్పష్టముగా జెప్పలేదా? మఱియొక వింతగూడ వినివచ్చితిని. నిన్నమీరు చెప్పిన యవ్వను మోసముచేసినవా డతండేనట. రాజసభలో నాయవ్వపొందెడు దుఃఖమునుజూచి మోహనచంద్రునితో నిజముచెప్ప యా సొమ్ము తానిత్తునని యొప్పుకొని యవ్వను విడిపించెనట ఆవార్త నప్పనివాని నడుగ జెప్పినాడు. మఱియు మీవాదముమాట రాగా రేపటిదినము నిరూపింతుమనిజెప్పెను. పెద్దతడవందుంటి నతండు తెనాలిరామలింగకవి యగుట నిశ్చయముగా వినివచ్చితినని చెప్పినది

ఆ మాటలువిని మందారవల్లి ప్రియంవదా మంచివార్త వింటిమి. మన చిక్కులు వదలినవి. బుద్ధిః కర్మానుసారిణి! యను నార్యోక్తి యెంతసత్యమైనదో చూచితివా? మొదటనుండియు రామలింగకవి పేరు వినినప్పుడెల్ల నాయుల్లమున నెద్దియో వింత సంతసము బొడమినది కానిమ్ము యావార్త నాతండ్రి కెఱింగించి వారి నీరాత్రి విందునకు బిలిపింతును. అప్పుడు వారితో బ్రసంగింపవచ్చునని చెప్పి యప్పుడే తండ్రియొద్దకుబోయి యావృత్తాంతము జెప్పినది.

విజయవర్మ రామలింగకవిని నమిత్రముగా విందునకు బిలిపించెను అందరు రాత్రిభోజనములు చేయుచుండ మందారవల్లియు బ్రియంవదయు వింతగా నలంకరించుకొని పట్టుచీరలు కట్టుకొని పంక్తుల వెంబడి దిరుగుచు గొసరికొసరి వడ్డింప దొడంగిరి. వారిచమత్కార వచనంబులువిని రామలింగకవి మిక్కిలి యక్కజము చెందజొచ్చెను.

మఱికొంతసేపునకు మందారవల్లి యొకమూల నిలువంబడి తండ్రీ! రామలింగకవిగారి ప్రఖ్యాతి వినుటయేకాని చూచియుండలేదు. నేడు సుదినముగా దలచెద