పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

206

కాశీమజిలీకథలు - మూడవభాగము

డుల ప్రాయము గలిగియుండును. నేనుబోయి రహస్యముగా విమర్శించి మీకు వార్తనంపెద నంతదనుక నిందుండుడు. మా మంత్రిపుత్రికయు నా ప్రాంతమందే యుండవలయు నిరువుర చరిత్రముల నరసివచ్చెద నన్నంపుడని పలికిన నందఱు సమ్మతించి యప్పుడే నన్ను బయనముచేసిరి. నేను జాలినంత విత్తముగై కొని సుముహూర్తంబున బయలువెడలి గంగానదీ కూలంబున నున్న పట్టణంబు లన్నియు జూచుచు గొన్నిదినంబులకొక పట్టణము చేరితిని.

నేను గంగానదిలో గొట్టుకొనిపోవునప్పుడు పల్లెవాడు శిశువుం దీసికొనిపోయి గట్టెక్కిన గ్రామములో దీరముననున్న వృక్షములలో గొన్నిటి గురుతుపట్టుకొని యుంటిని గావున నా నీటిరేవులో నట్టి మ్రాకులంగాంచి యాపురిలో గొన్ని దినంబులు నివసించితిని. మఱియు గంగానదిలో నీదెడు పల్లెవాండ్ర యిళ్ళకుంబోయి క్రమంబున వాండ్రతో మైత్రి సంపాదించి ఆడువాండ్రకు బారితోషికములిచ్చి కొన్ని యేండ్లక్రిందట గంగలో గొట్టుకొనివచ్చిన పిల్లను దీసిన పల్లెవాడెవ్వడని యడుగ జొచ్చితిని.

అడుగ నడుగ ముసలిది నే యిచ్చిన పారితోషికమునకు సంతసించుచు మెల్లననాతో నమ్మా! నీవడిగిన రహస్యము నాకుగాక మఱియెవ్వరికి దెలియదు. నీవడిగిన నాకు జ్ఞాపకము వచ్చినది. నా కుమారుడొకనాడు గంగలో గట్టెలకై నీదుచుండ నొకయాడుది శిశువుతో గొట్టుకొని పోవుచుండ జూచి బాలికను మాత్రము తెప్పపై నెక్కించుకొని వచ్చి యా కథ నాకు జెప్పుచు నా శిశువును జూపెను.

బంగారు కణికవలె మెఱయుచున్న యా బాలికంజూచి నేను విస్మయమందుచు అన్నా! ఈ చిన్నది సిరిగలవారి పుత్రికయని తోచుచున్నది మనము దీనిబెంపజాలము. మన పొరుగుననున్న మనోరంజనికి సంతానములేదు కావున మనకు దగిన సొమ్మిచ్చెనేని దానికిత్త మడిగిరమ్మని చెప్పితిని. వాడుబోయి దానికాకథ యంతయు జెప్ప ముప్పిరిగొను సంతసముతో నప్పడతి తెప్పున మా యింటికివచ్చి ముచ్చట పడుచు నచ్చేఱుతకూనం జూచి ముద్దిడుకొనుచు నప్పుడే తన యింటికి దీసికొని పోయినది.

మేము కోరినంత ధనమిచ్చి యీ రహస్యమెవ్వరికిం జెప్పవద్దని మాచే బ్రమాణికము చేయించుకొనినది. కొన్నియేండ్లకు నా కుమారుడు నీటిగండంబువలననే మడిసెను ఆనాథనై నేనిట్లున్నదాననని కన్నీరు విడువజొచ్చినది. అప్పుడు నేను మిక్కిలి సంతసించుచు నోసీ! ఆ చిన్నది యిప్పటికి బెద్దదికావలయునే యెందున్నదియో అని అడిగిన నది అబ్బో! అబ్బాలికామణి మిక్కిలి విఖ్యాతి బొందినది. మనోరంజని దానికి మందారవల్లియని పేరుబెట్టి చాలయేడులు వచ్చుదనుక నెవ్వరికిం జూపక మిక్కిలి గారవముగా బెనుచుచు మేలిచీరలు బంగారుదొడుగులు దొడిగి