పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

202

కాశీమజిలీకథలు - మూడవభాగము

జూడ నించుకయు దెలియక గుందుచు నిరాశచేసికొని పోయెదము, వేగముగా బంపుమని యామెను బ్రార్థించితిమి.

అంతకుమున్ను సన్నాహము చేసియుండిన యోడలోని కప్పుడే గూఢముగా పంపినది. మేమా ఓడ నెక్కినతోడనే నావికులు తెరచాపనెత్తి ఓడను వదలి నడిపింప దొడంగిరి. మేము పెద్దతడ వరుగువరకు రోలంబ తీరమున నిలువంబడి చూచుచునే యున్నది. అప్పుడు గాలి వినిమయముగా నుండుటచే నా యోడ జంబూద్వీపమునకు రావలసినదానికి మారుగా నిర్మానుష్యంబైన మరియెక దీవికింగొట్టుకొని పోయినది. ఓడవాండ్రు మమ్మందు దింపి మంచిగాలి తిరుగువరకు నిందుండవలయునని మాతో జెప్పిరి. భోజనపదార్దములు సమృద్ధిగా మాయొద్దనుండుటచే నందు సుఖముగా గొన్నిదినంబులు గడిపితిమి.

ఇంతలో నొకనాడు కల్పవల్లికి బ్రసవవేదన యావిర్బవించుటయు నేను మిక్కిలి భయపడుచు దైవమును పార్థింపుచుండ నా చేడియ శుభలగ్నమందు నొక కూతుంగనియెను. నేనప్పడతి కప్పటికి దగిన రీతిగా గొదవరానీయక పురుడుపోసితిని రత్నకళికవలె నాబాలిక మెరయుచు మామకహృదయ శోకాంధకార మించుక విరియజేసినది నావికులును కొంచముకాలములో మంచిగాలి వీచునని మమ్ము నోదార్చుచుండిరి.

అంతలో మఱియొక యోడ మా యోడవలెనే యా దీవికిం గొట్టుకొని వచ్చినది విధిఘటిత మక్కజమైనదిగదా? అందెవ్వరుందురో యని యరచుచుండ నందుండి మకరందుండు తీరమునకు వచ్చెను. మేమతనిం జూచి విస్మయశోకంబులు మనంబు నుత్తలపెట్ట నతనిపై బడి యేడ్చితిమి. అతండు మమ్ము నోదార్చుచు మా వృత్తాంత మాద్యంతము విని దుఃఖింపుచు నిట్లనియె.

కాంతలారా? నేను మీచెంతనే స్వాంతము నిడికొని ద్వీపాంతరమునకుం బోయి కొన్నిదినంబులకు నింటికివచ్చి మిమ్మా ఉద్యానవనంబునంగానక యందున్న వారిని మీ వృత్తాంతమడిగితిని. ఆ దుష్టురాలు వారికిం జెప్పియుంచినది కాబోలు? వాండ్రు నాతో గొన్నిదినములక్రిందట జంబూద్వీపమునుండి యొక యోడ వచ్చినదనియు నందులోనున్న తమ పరిచితులం గలిసికొని యా చేడియ లాయోడ యెక్కి, యాద్వీపమునకు బోయిరనియు జెప్పిరి.

అప్పుడు నేను బెక్కుతెరగుల నంతరంగంబునందలపోయుచు నేమియుంతోచక బెక్కండ్ర నడిగితిని. అందరు నొక్కరీతినే నుడుపుటచే నిక్కువమనికొని విరక్తి దోప గతమును దలచికొనుచు నాలుగుదినంబులునుండి వెండియు మా తండ్రియొద్దకు బోయితిని. కుశద్వీపమునకు బోయిన కార్యము దీరకున్నను మిమ్ము జూచు దలంపుతో వేఱొకపని గల్పించుకొని వచ్చితిని. కావున వెంటనే పోవలసివచ్చినది అందు రెండునెలలుండి వెండియు మా వీటికి వచ్చితిని. అప్పుడు మరల మా విష