పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కల్పవల్లి కథ

199

తా॥ ఇంతీ! కాంతుండు నాచెంతజేరినతోడనే కోకముడివిడిపోవుటయును గట్టు పుట్టంబు కాంచీగుణంబుపట్టున నితంబమున మాత్రమించుక నిలిచినట్లు కొంచెము జ్ఞాపకమున్నది. తదంగసంగమైన వెనుక నతండెవ్వడో నేనెవ్వతెనో యారతియెట్టిదో యేమిచేసెనో యించుకయు నెఱుంగ. నీతో నేమని వక్కాణింతునని తత్సమయోచితములైన మాటలచే నాకు సంతోషము గలుగజేసినది. అట్టి సంతోషముతో మేము మురియుచుండ నాయోడ పదిదివసంబులకు సింహళద్వీపపు రేవునకుబోయినది. ఆకాలము మాకొక గడియలాగున వెళ్ళినది.

ఓడ రేవుచేరినతోడనే యందు వేచియున్న రాచకింకరులు పెక్కండ్రువచ్చి యందున్న వస్తువాహనము లన్నియు రాజగృహంబునకుజేర్చిరి. పిమ్మట మమ్మా రాజకుమారుడు రహస్యముగా నొక యుద్యానవన సౌధములోనికిం దీసికొనిపోయి యుంచెను.

కొన్నిదినములందు మేము సుఖముగా కాలము గడిపితిమి. మకరందుడు ప్రతి దినము వచ్చి యభీష్టవినోదములతో గొంతసేపు సంతోషమనుభవించి యరుగుచుండువాడు అతండు యువరాజగుటచే మారాక నేరికి దెలియకుండునట్లు గూఢచారుల నియమించెను. ఆతండంతకుమున్ను పెండ్లి యాడిన భార్య పేరు రోలంబయట. ఆ ద్వీపమున దఱుచు గాంతలకు భ్రమరనామంబులు బెట్టుచుందురు. మకరందునికి రోలంబయందుగల కూర్మి గ్రమంబున గొరతవడజొచ్చెను నూతనాభిలాష బలమైనది గదా?

ఒకనాడు సాయంకాలమున నతండు బండిమీద మా యుద్యానవనంబునకు వచ్చుచుండ నతనిబండి వెంబడిని యొక చేటికవచ్చి యచ్చటచ్చట నిలువబడుచు మా యుద్యానవనము గుఱుతుచూచుకొని యేగినది. సౌధోపరిభాగమునుండియే నది జూచినది. ఆ వృత్తాంత మారాజపుత్రునితో జెప్పవలయునని తలంచియు నంతలో మరియొకగోష్టి వచ్చుటచే మరచితిని.

మఱునాడుదయంబున మాయింట బనిచేయుచున్న దాది యొకతెవచ్చి "అమ్మా! ఈ దేశమున నెఱుకలసానులు ఎఱుక చక్కగా జెప్పుదురు. అట్టిసాని యొకతె యిప్పుడు మనవీథిలోనుండి మీ కెఱుక కావలయునా! అని అడుగుచున్నది. అడిగి వత్తునని వచ్చితిని. ఏమనియెదరని పలికిన విని నేను మారాజపుత్రిక కప్పటికి నెలదప్పెననియనుమానముగా నున్నందున నావిషయము దెలిసికొను తలంపుతో చప్పున రప్పింపుమని చెప్పిన నదివోయి నిముషములో దీసికొనివచ్చినది. దానితో మఱియొక చిన్నదిగూడ వచ్చినది. అది దానిపుత్రికయట. వాండ్రనొకగదిలోనుండ నియమించి నేను మా రాజపుత్రిక యొద్దకుబోయి యా సంగతి జెప్పిన నమ్ముద్దియ పోపొమ్ము యెక్కడిదానవు మూడుదినములయినదో లేదో వెఱ్ఱితలంపులం బెట్టిదంబులు చాలులేయని యాక్షేపింప లక్ష్యముసేయక చేయిపట్టుకొని లాగికొనిపోయి