పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కల్పవల్లి కథ

197

యువలాలసమువలన జెప్పకతీరినదికాదు. జరిగిన కథయంతయుంజెప్పి యా యుత్తరములన్నియు జేతికిచ్చితిని. అప్పుడది ముక్కుపై వ్రేలిడుకొనుచు ఏమేమీ! కామినీ! నీవింత సాహసమునకు బూనుకుందువా? నాతోనయినం జెప్పవలదా? నీతల్లి యనురాగ మెట్లు త్రోయమనసాడెను. అయ్యో! సఖురాండ్రము మామాట చెప్పనేల నిన్నొకదినము చూడక మనసొల్లని నీతండ్రికేది దిక్కు? చాలులే ఇటువంటి ప్రయత్నము లెన్నటికి జేయకుము. నీవు కోరితివేని యారాచకుమారు నిందుండ నియమించెద అతండు కాకున్న వాని తాత మఱియొకని రప్పింతు నీ యుద్యమము విడచితినని యిప్పుడే తిరుగ నుత్తరమునిమ్ము. నేను తీసికొనిపోయి యీయన కిచ్చి వత్తునని నయము, భయము, చనువు మెరయబలికిన విని యులికిపడుచు నేమియుం బలుకక తలవంచుకొని వెక్కి వెక్కి యేడువదొడఁగితిని.

అప్పుడది వెరచుచు కన్నీరుదుడిచి ప్రియసఖీ! నా మాటలు నీకు రుచింపలేదా యేమి? లోకపరిపాటి గణియించి యిట్లు చెప్పితిని దీనికి జింతింపనేల? ఇందలి మంచిచెడ్డలు నీవే యాలోచించుకొని యుత్తరమిత్తువేని నీయిష్టము వచ్చినట్లుచేయు దాననని పలికిన విని నేనును వెడవెడ జూపుల దానిచూచుచు నిట్లంటిని.

బోటీ! మాటలెన్నియేనిం జెప్పవచ్చును. ఆ రాజకుమారుని జూచిన నీ విట్లనవు. అతడు మన సిరికిలోబడి యుండువాడుకాడు తానొక దీవికి బ్రభువట. యన్ని యతిశయగుణంబులు మఱియొకరి యందుండుట జూడము దీని నీ వేమియుం బ్రతిజెప్పక యొడంబడుము.

ఆడుదానికి తల్లిదండ్రులు బాల్యమునందే కాని ప్రాయమునందు దూరస్థులే. తల్లిదండ్రులవిడిచి రుక్మిణీదేవి శ్రీకృష్ణుని వరించి యరుగలేదా? నీవొకదానవు నాతో వచ్చిన నేకొరతయు నుండదు. లెమ్ము పయనము సవరించుకొనుమని యెన్నియో దృష్టాంతరములు చెప్పి దాని మతి గరగించితిని.

పిమ్మట నాకొమ్మయు సమ్మతించి ప్రయాణసన్నాహము గావించినది. రాత్రి ప్రొద్దుపోవువరకు నాయొద్దనేయున్నది. ఆ దేవాలయము దాపున నుండుమని చెప్పి యంపితిని. అంతకుమున్నా యిరువు చూచివచ్చి యదియే చెప్పినది. నియమించుకొన్నప్రకారము నేను కోటగోడకు గొలుసువైచి దిగివచ్చితిని. తరువాయికృత్యము నీవెఱింగినదియేకదా! మా రామామణి కెద్దియో యంతరాయము కలిగినది. లేకున్న రాకుండినదికాదు. మనుష్యసంకల్పము లెప్పుడును తలచిన యట్లు నెరవేరవుకదా? దానికన్న నెక్కుడుదాని నిన్ను భగవంతుడు నాకు సమకూర్చెను. నీమాట లతిప్రగల్భములుగా నున్నయవి. నీవు మంచినేర్పరివని తోచెడిది. అదియునుంగాక మా పెదతల్లికి హితురాలవు. నన్ను దాని జూచినట్లు జూడుము ఇటుమీద నేమి చేయవలయునో నాకు దెలియదు. ఆ రాజకుమారునకు నాకు జరిగిన ప్రసంగము వింటివిగదా! తరువాయి కృత్యము నీవే యాలోచింపుము. నా ప్రాణము నీయధీనము చేసితిని. అనాథను నన్ను రక్షింపుమని నాపాదములం బడినది.