పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాగమణి కథ

191

వరకు బోయితిని అప్పటికి మేను వివశత్వము నొందినది. మిక్కిలి యాకలి యగుచున్నది. కన్నులు చూచుటకు వశముకాక మూసికొని యా దారువునందు శిరము మోపి యట్లు పడియుంటిని. శరీరమంతయు నీటిలోనున్నది. రెండుచేతులు నా దారువునకు బెనవైచితిని. అప్పుడు నిద్రయో, మూర్ఛయో నేనెఱుంగను, న న్నావేశించినది. తరువాత నేమి జరిగినదో నాకు దెలియదు. ఎంతదూర మెన్నిదినములు పోయితినో చెప్పలేను. తిరిగి నేను గన్నులు తెరచి చూచువరకు నొకపట్టణము రేవులో నొక బ్రాహ్మణుండు నానోట నన్నరసము పోయుచుండెను. ఆ పుణ్యాత్ముని వలన నేను జీవించితిని. అతండు స్నానముచేయుచుండ నేనా దారువుతో నా రేవులోనికి గొట్టుకొనిపోయి మారువడిలో నిటునటు తిరుగుచుంటినట. దారువుపయి చేరియున్న నామొగ మాపాఱునికి గనఁబడినది. తరువాత నా ముక్కెరలోనున్న వజ్రపురవ్వ తళుక్కుమని మెరసినదట. అదిచూచి యావిప్రుడు నన్ను శవముగా నిశ్చయించి ద్రవ్యాశచే నా దారువును పట్టుకొని మెల్లగా తీరమునకు లాగెను. నా మొగము దగ్గరగా జూచినంత ముక్కున నూపిరియున్నట్టు పొడగట్టినదట. ఇంతలో మఱియొకరెవ్వరో యచటికి వచ్చిరట వారిరువురు విమర్శించి నన్ను శవముకానియట్లు నిశ్చయించి చేతులతో నన్నుబట్టుకొని యొడ్డున బరుండబెట్టిరి. ఊర్పు లుండుటచూచి యా పుణ్యాత్ముండు వడిగా దనయింటికిబోయి మజ్జిగలో నన్నముం పిండిదెచ్చి నానోటిలో నెక్కించెను.

ఆన్నసారము తగిలినతోడనే నాకు స్మృతివచ్చినది. తరువాత నేనడుగంగా నతండీ వృత్తాంతమంతయుం జెప్పెను నాకు స్మృతియు బలము నించుక గలిగిన తోడనే నన్నా బ్రాహ్మణుండు తన యింటికి దీసికొనిపోయి యెక్కుడుగా యుపచారములుచేసి నాలుగుదినములలో నన్ను యథాస్థితికి దెచ్చెను, నేనా పాఱునకు నా యొడలి నగలన్నియు నిచ్చితిని. నా వృత్తాంతమంతయు జెప్పి నన్ను మా దేశమునకు దీసికొనిపోయితివేని మంచి పారితోషిక మిప్పింతునని చెప్పితిని ఆతఁడును సమ్మతించెను.

ఇంతలో దైవవశమున నా బ్రాహ్మణుడెద్దియో రోగము వచ్చి హఠాత్తుగా ప్రాణములు వదిలెను పుణ్యాత్ములు చిరకాలము జీవింపరుగదా. తండ్రిపోయినదానివలె నేనతనికొరకు విలపించితిని. ఆయనభార్య నాపాదము మంచిదికాని నన్ను వారింటిలో నుండనీయక లేవగొట్టినది. గ్రహచారము చాలని దినములలో నెచ్చటికి బోయినను కష్టములు రాకమానవని నిశ్చయించి నేను స్వదేశమునకు బోవుటకు సహాయులెవ్వరయిన దొరకుదురేమోయని విమర్శింపుచు గదలి నలుమూలలు దిరుగుచు నా పట్టణములోనున్న దేవాలయములోనికి బోయితిని. ఆ పట్టణముపేరు కలిఘాతానగరమట నేను సాయంకాలమున కా దేవాలయములోనికి బోయితిని. అందు గన్నులపండువుగా దీపములు పెట్టబడియున్నవి. ఒకమూల వేదమంత్రములు నొకమూల హరిభజనలును నాకు శ్రవణానందము గావించెను. చాల ప్రొద్దుపోవు