పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సుప్రభ కథ

189

అప్పుడు మంగమణి యయ్యంగన దైన్యంబు దిలకించి యించుక కొంకుచు గాంతా! సంతతిగురించి యడిగినంత చింతించుచుంటివి. నదీనెద్దియో కొరంతయున్నదని తలంచెదను. దైవకృత్యంబులకు జింతించుట నిరర్థకంబుగదా! నీచింతాకారణం బెఱింగింపుమని యుపశమనపూర్వకముగా నడిగిన సుప్రభ కన్నీరు దుడుచుకొనుచు నిట్లనియె.

వాల్గంటీ! నావంటి దురదృష్టవంతురాలు యెందునను లేదు. నన్నేల పొగడెదవు. నాకు సంతతిలేదు. ఇరువదేండ్ల క్రిందట నొకయాడుబిడ్డ పుట్టినది. నాపట్టికి సంవత్సరము నిండగనే పేరప్పగించుటకై మేము సకుటుంబముగా గాశికిం బోయితిమి. ఆ సమయంబున గంగానది నింగిపొడవున పొంగినది. అప్పుడు మాకు గంగపూజ చేయవలయునని యుత్సాహము పుట్టినది. పిమ్మట నాపతి మారేడుపత్రియు తులసిపత్రియు పెక్కురకముల పువ్వులును అరుణగమలములను వేనవేలు తెప్పించెను.

తరువాత నొకయోడమీద నేనునుం బతియు బిడ్డయు నాగమణి అనుదాదియు గొందఱు బ్రాహ్మణులు నెక్కితిమి. నావికు లాయోడను బ్రవాహాభిముఖముగా నడిపించుచుండ బ్రాహ్మణులు గంగాసహస్రనామములు జదువ బయిడిపల్లెరమున బూవుల నిడుకొని నేను పతితో నత్యంతభక్తిపూర్వమున పూజ గావింపుచుంటిని.

అప్పుడు నాగమణి నాపుత్రికను జంకనిడుకొని మాయొద్ద నిలువంబడిన మమ్ములను జూచి నాముద్దుబాల తశయలోనున్న పూవు లందుకొని తానుగూడ గంగలో వైవ దొడంగినది. అదియు మాకు మిక్కిలి ముద్దుగాదోచినది. ఆ దాదియు బూవులందించు చుండ నాపాప తేవకు నీటిలో వైచుచుండెను. అంతటితో మానుమని చెప్పుటకు మాకు బుద్దిపుట్టినదికాదు. అదియు నొకవేడుకగా నుండెను. మఱియొకమాటు మా దాది పూవు చేతికందించి విడువిడుమని నీటివయిపున కించుక వంగినంత నాబాల బూవు వైచునప్పు డుంకించుటయు బరువై చేయిపట్టు వదలి తటాలున నీటిలో బడినది. దానితో నాగమణియు దటాలున గంగలో నుఱికినది. ఇరువురు కొట్టుకొనిపోయిరి. ఎల్లరు గొల్లుమన జూచితిమి. ఏమియు గనంబడినదికాదు. జీవితాశ వదలి గంగలో బడవలయునని యెంత సాహసించినను అందున్నవారు నన్ను గదలనిచ్చిరి కారు.

తరువాత వారికొఱ కెన్నియో ప్రయత్నములు చేసిరిగాని కళేబరములయినను గనంబడినవికావు. ఆ బాలికామణి సౌందర్య మేమని చెప్పుదును. ఆలాటి ముద్దుకూతురు నాకు దక్కునా? ఇదియొక నిర్భాగ్యజన్మము దానినిప్పుడు స్మరింపనేల? మీరు వచ్చిన కార్యమె ద్దియో చెప్పుడు అని యడిగినది.

వారట్లు మాటలాడుకొనుచున్న సమయంబున విజయవర్మ ఇంచుక ప్రాయము మీరియున్న యొకయాడుదానని వెంటబెట్టుకొని యాయంతఃపురమునకు వచ్చెను. అతనిరాక చూచి మంగమణియు, ప్రియంవదయు లేచి లోపలకుంబోయిరి. అప్పుడు మంత్రి భార్యం జూచి ముదితా! ఇది యెవ్వతియో యెఱుంగుదువా! అని యడిగిన నామె