పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అవ్వకథ

187

హింపవచ్చును. ఆ వెలపెట్టి మాయింటనున్న వారికందరకు వస్త్రంబులు కొని యియ్యుడు మీదయవలన బెద్దకాలము సుఖియింతుమనిన వల్లెయని యతండొప్పుకొని అవ్వా! నీవాపుట్టంబుల నేరికొనియుంచుము. ఇంతలో నీచీర నాభార్యకు జూపివచ్చెద నదియు మెచ్చవలయుంగదా. ఇదిగాక మఱియేమైన నిమ్మని చెప్పునేమో మాబస యిందాక నీవు చూచినదే తృటిలోవత్తునని పలుకగా సమ్మతించి వేగము రమ్మని చెప్పితిని

అప్పుడతం డావర్తకునితో నేనీచీరను మాయాడువాండ్రకు జూపివత్తు నంత దనుక యీయవ్వ తాకట్టుగా నుండును మానివాసము దాపుననే యున్నదని పలుకగా నతండు నన్ను జూచి యేమమ్మా నీవీయన నెఱుంగుదువా యని అడిగెను. అయ్యో! ఈయన యెంతవాడనుకొంటివి. నేనుకాదు లోకమంతయు నెఱుంగును. నీ సొమ్మున కేమియు భయములేదు. నేను పూటయని చెప్పి యాదొంగను చేతులార ననిపితిని. పిమ్మట మా కుటుంబమున కతండిత్తునన్న చీరలు జామారులు నేరి మూటగట్టి యతనిరాక కెదురుచూచుచుంటిని. ఎక్కడరాక సాయంకాలమువరకును జూచితిని. కన్నులు చిల్లులు పడినవి అతనిజాడ యేమియుం గనబడినదికాదు. అప్పుడు భయపడుచు నాతనిం దీసికొనివత్తుఁ బోనీయుడనిన వర్తకుడు గదలనీయడయ్యె. ఏమి చేయుదును! మఱికొంతసేపటికి నిరాశజేసుకొని గుండెలు బాదుకొనుచు అయ్యో! వర్తకుడా! వాడెవ్వడో నేనెఱుంగను వీధిలో గనంబడి చీరలిత్తును రమ్మనిన వచ్చితిని. ఇంతమోసకాడని యెఱుంగనైతిని. నన్నేటిలో దింపినాడు యేమిచేయుదును. నన్ను బోనిమ్ము! గ్రామమంతయు వెదకి తీసుకొనివచ్కెద నిందున్న లాభ మేమి? యని యనేక ప్రకారముల వేడికొనగా నావర్తకుడు దురాశాపాంకురాలవు నీకిట్లు కావలసినదే. నేనడిగిన జగమంతయు నెఱిగినవాడనియే చెప్పితివే? నాకేమి నీకొంప నమ్మించి పుచ్చుకొనియెదనని నన్నుదిట్టుచు నావెంట గొందఱ మనుష్యుల నంపెను.

వాండ్రును నేనును గ్రామమంతయు వెదకితిమి యెందును వాని జాడ గనంబడినదికాదు. అప్పుడు నేనా వర్తకునియొద్దకు బోయి దీనురాలను, ముష్టిముండను, విడువుము తెలియక మోసపోయితినని యెంత బ్రతిమాలినను వానికి దయవచ్చినది కాదు. అందుల గురించి పత్రికాముఖంబున నీచక్రవర్తిగారియొద్ద దగవుపెట్టెను. ఆ తగవునకే నేను వచ్చితిని. ఈ పుణ్యాత్ముడేమి చేయునో తెలియదు తినినదికాదు, కుడిచినదికాదు. వీధిలోబోవుచుండ మీదబడినది అని తన వృత్తాంతమంతయుం జెప్పుకొని యాయవ్వ విలపించినది.

ఆకథవిని మంగమణియుఁ బ్రియంవదయు లోన నవ్వుకొనుచు లోభిజనుల ద్రవ్య మీలాగుననే పోవును. ఆ బ్రాహ్మణు డెవ్వడో మిక్కిలి చతురుడు. మన రామకవియేమో యని తలంచుచు దత్కా,లోచితములయిన మాటలచే నా యవ్వను వోదార్చిరి.