పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(23)

మంగమణికథ

185

నొందినది. ఆహా! తత్సుఖపారవశ్య మనుభవైకవేద్యముగదా? ఎంత రతిప్రౌఢుండయినను నంతలో గళాస్థాన మరయుట దుర్ఘటము ఏమియు నెఱుంగనట్లేయుండెను. అప్పుడు నేను సిగ్గుపడి డగ్గున లోనికి బోయితిని. ఈచర్య లతఁ డెరిగింయే చేసెనని తలంచెదను. నాడెందము సందియ మందుచున్నది. చెప్పుమని యడిగిన నవ్వుచు బ్రియంవద యిట్లనియె.

సఖీ ! అతడెఱుగనివాడుకాడు. మనమే బేలలమైతిమి. గురుశిష్యులిద్దరు మాట్లాడుకొనిరని తలంచెదను. సాయంకాలమువరకు యీ రేయి నతనితో మాటాడను. ఉపేక్షభావముతో గాలక్షేపము చేసెదనని యనుకొని యతనిం జేరినతోడనే యంతయుం మరచి వేఱొకదారి బడుచుండును. శూలాయుధునంతవానిని గోలకు దెచ్చిన పచ్చనివిల్కాని పూముల్కులకు నగ్గపడకుండుటకు మనమెంతవారము. వ్రతమువిడిచినను సుఖము దక్కినదికాదే 'వలచివచ్చిసను రంభనయిన వాని కాదనుట' మగవానికి సహజగుణము. రాత్రి నాశక్తియంతయు జూపితినికాని యతనికి వలపు గలిగింపలేకపోతిని. ఇంక నేమి చేయవలయు? వారిమొగములు జూచుటకు సిగ్గగుచుండును. కావున మనదారిని మనముపోవుటయే యుచితమని తోచుచున్నది. అనిపలికిన విని మంగమణి యిట్లనియె.

అయ్యో! ఎంత మోసపోతిమి ఏదియేటి యఖిలాష. పాపము వారిని నిందించెదవేల? మనవృత్తాంత మంతయును మరచి మనమే మోహజలధిలో మునింగితిమి. వారే యుద్దరించిరి. జాతిలక్షణము లేమిటికి పోవును? చాలుజాలు. పురుషసాంగత్యం వలదింక పోవుదమురమ్ము. ఢిల్లీచక్రవర్తి మంత్రి విజయవర్మ భార్య సుశీల అక్కయట సుశీల నడిగి పరిచయపత్రిక దీసికొనిపోవుదము దాన గార్యసాఫల్యమగునని నిశ్చయించి యామెం బ్రార్థించి యట్టిపత్రికకుం దీసికొని రామలింగకవికిని సుభద్రునకు దెలియకుండ నారాత్రి బండి తోలించుకొని యాయించుబోడు లిరువురు కతిపయప్రయాణంబున ఢిల్లీపురంబున కరిగిరి.

రామలింగకవియు మరునాడు తమకు రాజపత్ని యిచ్చిన వస్తువాహనములన్నియు నావీటిలో నుత్తములగు బ్రాహ్మణులకు బంచిపెట్టి ధర్మకేతు నమమతి వడసి యప్పురంబు వెలువడి క్రమంబు ననేక జనపదంబులు గడచి యందందు గర్వాధికులయినవారిని వంచించుచు గొన్నిదినంబులకు ఢిల్లీపురి చేరెను.

అట్లు మంగమణి ప్రియంవదయు ఢిల్లీపట్టణము చేరి చూచువారి కసహ్యము దోచునట్లుగా మలినాంబరములు ధరించి ముందుగా నొకసత్రంబున నివసించిరి. అందెద్దియో కారణమున నూరక వగచుచున్న యొక వృద్దాంగన జూచి సాయంకాలమున మంగమణి అవ్వా! ప్రొద్దుటనుండి నిన్ను జూచుచున్నదాన నూరక వగచెదవు ఓదార్చువారెవ్వరు గనంబడరు కారణమేమని యడిగిన నాజరఠ యిట్లనియె.