పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

178

కాశీమజిలీకథలు - మూడవభాగము

వదన గృతజ్ఞతాసూచకములగు మాటలచే నతనిని బొగడుచుండ రామలింగకవి యా బండిదాపునకుం బోయి క్రమంబున బరిచయము రెట్టింప జనువుచేసి బోటీ, మీ రేమిటివారు? ఢిల్లీ కేటికి బోవుచున్నవారు? మీ పేరెయ్యది? రెండవయువతి నీ కేమి కావలయునని అడిగిన నప్పడతి యిట్లనియె.

అయ్యా! మేము వైష్ణవులము. మామగవారు ఢిల్లీ చక్రవర్తిం జూడబోయిరి. వారి యొద్దకు మేము పోవుచున్నారము. నా పేరు మంగమణి. ఈ చిన్నది నాకు బినతల్లి కూతురు. దీనిపేరు ప్రియంవద. నేటిరాత్రి మీ సహాయము దొరకకున్న నీ అడవిలో మడియవలసివచ్చును పాపము. మీరు మానిమిత్త మీరాత్రి భోజనము విడిచితిరి. మీ యుపకార మెన్నటికిని మఱువము. మీ అభిధేయమెద్ది? ఏయే విద్యలం జదివితిరి? జన్మభూమి యెచ్చటనని యెంతయో నైపుణ్యముగా నడిగినది.

రామలింగకవి తనపేరు రామకవిఅనియు దన శిష్యునిపేరు సుభద్రుడనియుఁ దన జన్మభూమి యుత్తర కురుదేశమనియు దనకన్నివిద్యలలో బాండిత్యమున్నదనియుం జెప్పెను. ఈరీతి వారు మాటలాడుకొను చుండగనే తెల్లవారినది. ఇంతలో బండివాడెద్దును దోలుకొనివచ్చెను. మంగమణియు బ్రియంవదయు బండిలో ముసుగులు వైచికొని కూర్చుండుటచే సామాన్యయువతులవలె గనంబడుచుండిరి. అంత బ్రాతఃకృత్యములు దీర్చుకొని వారు బండ్లలో కూర్చుండిరి. బండివాండ్రు అతివేగముగా దోలి మధ్యాహ్నమున కొక అగ్రహారము జేరిరి.

అందొకచో బసచేసి ప్రత్యేకముగా వండుకొన ప్రయత్నము జేయుచున్న మంగమణిని బ్రియంవదను వారించుచు రామలింగకవి మంచిమాటలు జెప్పి తమపాకములో గుడుచునట్లొడంబడ జేసెను. అదిమొదలు వారందరు నొక్కపాకములోనే భుజించుచుండిరి. మఱియు దారినడుచునప్పుడా పడతులబండి ముందిడి తమబండి వెనుక నడిపించుచు నిమ్నోన్నత ప్రదేశములు వచ్చునప్పుడు బండ్లు నిలిపి వారిం దింపి వెండియు వారెక్కిన తరువాత దమ రెక్కుచుందురు.

ఈరీతి వారితో నాలుగుదినములు దారినడుచువరకు నాతరుణులిరువురకు రామలింగకవియం దత్యంతప్రేమానుబంధము గలిగినది. అతనిం బరమోత్తముడని తలంచిరి. పరోపకారపారీణుడింతకన్న వేఱొకడు లేడని పొగడుచుండిరి. ఆతని ఋణ మేమిచ్చినను దీర్చుకొనలేమని నుడువదొడంగిరి.

అట్లు దినదినప్రవర్దమానంబగు స్నేహానురాగప్రయాణాభిలాషలతో నా యోషారత్నంబులు తన్ననుసరింప రామలింగకవి కొన్ని పయనంబులు నడిచి యొకనాటి సాయంకాలమునకు విద్యానగరమను పట్టణమునకుం బోయెను.

అప్పురము ధర్మకేతుండను రాజు పాలించుచుండెను. బహుజనాకీర్ణమైన యవ్వీట నొకసత్రంబున బసజేసి అమ్మఱునాడరుణోదయంబున స్నాన సంధ్యా