పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దుష్టవర్మకథ

173

వాల్మికాది మహర్షికల్పభేదంబును నూటపది విధంబుల బురాణము సెప్పగలము. ప్రతిమతంబునను యెన్నడో జరిగిన విషయము ప్రత్యక్షముగా నిప్పుడు జరుగునట్లు చూపుటయు జూచినవారు చెప్పినట్లప్పుడు వినినవారు వినిపించినట్లు మాపురాణము వలనం దెల్లముకాగలదు. ఇదియునుంగాక రామాయణములో భారతార్థము భారతములో రామాయణార్ధము, భారతరామాయణములలో భాగవతార్థము భాగవతములో భారతరామాయణార్థములు యీ మూటిలో విపరీతార్థములు విస్పష్టముగా జెప్పగలము. పెక్కులేల? ఇవి అన్నియు బ్రాహ్మణార్థము క్రింద మార్పగలము. మా ప్రజ్ఞ నిప్పుడేమిచెప్పిన మీరు నమ్మగలరు. చూచిన తరువాత మీకే విశదమగును.

దుష్ట - దీనికి మీరేమి పారితోషికము గోరెదరు?

రామ - మీరు సంతసించి తగినవారని యొప్పుకొనుటయే పారితోషికము. అంతకన్న మఱియేదియు మాకు నక్కరలేదు.

దుష్ట - అట్లయిన నావింతల మాకెప్పుడు చూపుదురు.

రామ - ఎప్పుడో అననేల యీ రాత్రియే.

దుష్ట - కావలసిన సంభారము లెట్టివి. ఏయే పురాణములు దెప్పించవలయును.

రామ - ఏదియు నక్కరలేదు. పురాణములన్నియు మా ముఖమందేఉన్నవి. సభాభవనము చక్కగా నలంకరింపుము. దూది కొంతతెప్పించియుంచు డింతకన్న మఱేమియు నవసరములేదు.

అని యీరీతి నతనితో సంభాషించి రామలింగకవి తన నివాసమునకువచ్చెను. అందున్న బ్రాహ్మణు లతనిమాటలువిని నివ్వెరపడుచు నంతటితో బురాణము ముగించిరి. కావున రామలింగకవి యొద్దకుఁబోయి తదీయవిశేషంబు లడుగం జొచ్చిరి.

ఆతండు వారినందఱను తాను జెప్పినట్లు వినువారిగా నొడంబడజేసి చేయందగిన కృత్యములన్నియు బోధించి యారాత్రి యా గ్రామములోనున్న బ్రాహ్మణు లెల్ల పరివేష్టింప దేవసహితుండయిన గురుడువోలె నొప్పుచు నా సభాభవనమునకు బోయెను.

దండహస్తులై వచ్చిన పౌరుల గాంచి దుష్టవర్మ యించుక వెఱచుచుండ రామలింగకవి అందున్న పీఠంబుల నందరం గూర్చుండ నియమించి దానును సుభద్రుండును బ్రధానాసనంబులం గూర్చుండిరి. అప్పుడు దుష్టవర్మ యా అద్భుతపురాణమును వినుటకు మిక్కిలి వేడుక పడుచు వేగముగా జదువుడనియు యుద్దపంచకములోని భాగములు వినిపింపుడనియు అతనిని దొందరపెట్టెను. సుభద్రుండు చదువుచుండ రామలింగకవి యర్ధము చెప్పుచుండెను.