పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మందారవల్లి కథ

163

వోలె నిబంధనాంశములం జెప్పి కూర్చుండెను. తరువాత నుభయుల శిష్యవర్గము తెరలముందర నిలువఁ బడి తమతమ యుపాధ్యాయుల ప్రభావములం బేర్కొనిరి. పిమ్మట మందారవల్లి శిష్యురాండ్రు వినోదముగా సంగీతముపాడ దొడంగిరి అప్పుడు రామలింగకవి శిష్యులు స్వకల్పితములైన సామగానముచే సభ్యులకు నవ్వుగలుగ జేసిరి. అమ్మహానాదంబు వారించుచు నమాత్యుఁడు నక్రోధంబుగా నోహో! మీరిపుడు నిబంధనాతిక్రమణదోషంబు గావించితిరి. తుదమొదలు లేని యీ వెఱ్ఱిగాన మెవ్వరు గావింపుమనిరి? ఇప్పుడు మీరుదండ్యులు. తగుసమాధానము చెప్పుడని అడిగిన శిష్యులిట్లనిరి.

అయ్యా! ఈ దినమున మందారవల్లితో మా యుపాధ్యాయ ప్రసంగించునని మేము గురుస్తుతి మాత్రముచేసి తెరముందర బొమ్మలవలె నూరక నిలువంబడితిమి. ఈమచ్చెకంటులెల్ల విచ్చలవిడి పాటలు బాడదొడంగిరి. వారికవి యెవ్వరియుత్తరువో చెప్పుడు దానికిబదులుగా మేము కులోచితమైన సామగానంబులం జదివితిమి. మేము దండ్యులమైనచో వాండ్రును దండ్యులే మమ్ము నందఱ నొక్క బందీగృహంబునం బెట్టింపుడు అని చెప్పగా అందరు అద్భుతముగా నవ్వదొడంగిరి.

అంతలో మందారవల్లి తెరలోనుండి సన్ననియెలుంగున సభ్యులారా! మేము వారకాంతలమనియు విదేశస్థులమనియు అలంతిగా జూడక మా విద్యావిషయములనే ఆరయగోరెదను. నిన్నటిదినంబున మా శిష్యురాండ్ర నీబ్రాహ్మణవటువులు కపటవాక్యములచే మోసపుచ్చిరి. అది పాండిత్యప్రకర్షముగాదు. ఇదివఱకు జరిగిన ప్రసంగములో శాస్త్రప్రవృత్తి యెంతయున్నదియో మీర యాలోచింపుడు. వట్టి మాటలచే గ్రంధములపేరులు సెప్పి గద్దించిన బోవువారమా? సకలశాస్త్రంబులు మాయెమ్ములంబట్టి యున్నయవి. గుణదోషతారతారతమ్యమరయ మీర యర్హులు. మీకిదే మ్రొక్కుచున్నదాననని పలికినది.

తరువాత మందారవల్లికిని లవిత్రకును నీ క్రింది విధమున సంవాదము జరిగినది.

మందారవల్లి - అయిలవిత్రే! కాఃకాః కళా భవత్యాధీతాః కస్యామధికః పరిశ్రమః కస్యాం వాదశక్తి రసల్పా బ్రూహిమే తస్యాంపృచ్ఛామి నోచేన్మాం పృచ్ఛయస్యాం కస్యామపి.

లవిత్రా! నీవేయే విద్యలం జదివితివి? ఏ విద్యయం దెక్కుడు పరిశ్రమచేసితివి? దేనియందు నెక్కుడుగా వాదింపగలవో నాకు జెప్పుడు. దానిలో నిన్ను నేను బ్రశ్నచేసెదను. లేనియెడల నీ యిష్టము వచ్చిన విద్యలలో నన్నడుగుము.

లవిత్ర - కింబ్రూషే ? ఉచ్చైర్వద మమ బధిరమస్తి ఏమంటివి? బిగ్గరగా చెప్పుడు నాకు చెవుడున్నది?

మందా - కాఃకాః అనుమాట వెండియుం చెప్పినది.